వనపర్తి జిల్లా కొత్తకొట మునిసిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్ జయరామ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఖమ్మం వార్డు ఆఫీసర్లు నిరసన తెలిపారు. శుక్రవారం మేనేజర్ సమక్షంలో కొత్తకోట మునిసిపల్ చైర్ పర్సన్ భర్త అయిన పొగాకు విశ్వేశ్వర్ అకారణంగా వార్డు ఆఫీసర్ అయిన మామిండ్ల జయరామ్ ను వివాదంలో ఉన్న ఫైల్ మీద సంతకం పెట్టమని ఒత్తిడి చేయడంతో జయరామ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫైలుపై తాను సంతకం చేయనని చెప్పడంతో తాను చెప్పిన పని చేయవా అని చైర్ పర్సన్ భర్త అయిన పొగాకు విశ్వేశ్వర్ జయరామ్ ను అహంకారపూరిత ధోరణితో సాక్షాత్తు మున్సిపల్ మేనేజర్ సమక్షంలో కొట్టడం జరిగిందన్నారు.
ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఖమ్మం నగర పాలక కార్యాలయంలోని వార్డు ఆఫీసర్లందరూ భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేసారు. అకారణంగా, అహంకార పూరిత ధోరణితో తమ తోటి వార్డు అధికారిని కొట్టి ఈ సంఘటనకు కారణమైన వనపర్తి జిల్లా కొత్తకోట మునిసిపల్ చైర్ పర్సన్ భర్త పొగాకు విశ్వేశ్వర్ ను చట్టరీత్యా శిక్షించాలని, అతని పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఆన్ డ్యూటీ లో ఉన్న ఉద్యోగస్తులకు రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేసారు. అనంతరం ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం వార్డు ఆఫీసర్లు వస్రం, సైదులు, లింగరాజు, సురేందర్, బిక్కం, అప్పయ్య, రమేష్, మల్లయ్య, శ్రీదేవి, హైమావతి, మాధవ్, శ్రీనివాస రావు, పల్లవి, జోష్ణ, సాయి, తదితర వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.