ఖమ్మం : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రం నుండి జడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించిన సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఈసందర్భంగా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ మహబూబ్ పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సౌజన్య మాట్లాడుతూ.. టీ తాగే లోపు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒక్క సంతకంతో వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీ కప్పులు చేత పట్టుకొని నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు. సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేపట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారన్నారు.
తక్షణమే సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ర్యాలీలో టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయ్ పూర్తి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీరాస్వామి, అడిషనల్ జనరల్ సెక్రటరీ అనిల్, ఉపాధ్యక్షులు సాంబశివరావు, ఇస్మాయిల్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ నిర్మల, జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయ లక్ష్మి, కోశాధికారి రాణి, కార్యదర్శులు కృష్ణ ప్రసాద్, సురేష్, భగవాన్, తదితరులు పాల్గొన్నారు.