భద్రాద్రి కొత్తగూడెం, ప్రభన్యూస్ ప్రతినిధి: హైకోర్టు అనర్హత వేటుపై సుప్రీం కోర్టు స్టే తర్వాత తొలి సారి కొత్తగూడెం నియోజకవర్గానికి గురువారం వచ్చిన వనమాకు గులాబీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. 5వేల మోటార్ సైకిళ్లతో ఎమ్మెల్యే వనమాకు అపూర్వ స్వాగతం పలికారు. జై కేసీఆర్.. జై కేటీఆర్.. జై బీఆర్‌ఎస్.. జై వనమా.. జైజై వనమా నినాదాలతో కొత్తగూడెం పుర వీధులు మార్మోగాయి. విజయోత్సవ యాత్రను తలపించిన వనమా స్వాగతం ర్యాలీలో గిరిజన సాంప్రదాయ కొమ్ము నృత్యం, బంజారాల సాంప్రదాయ నృత్యం , మహిళల కోలాటాలు , డప్పు వాయిద్యాలు, బాణా సంచా పేలుళ్ల తో సుజాతనగర్ మండలం నాయకులగూడెం నుంచి వనమా స్వగృహమైన పాత పాల్వంచకు పార్టీ శ్రేణులు, అభిమానులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.
ఓపెన్ టాప్ జీప్‌లో దారి పొడవునా ప్రజలకు ఎమ్మెల్యే వనమా అభివాదం చేశారు. పోస్టాఫీస్ సెంటర్‌లో గజమాలతో అద్వితీయమౖౖెన స్వాగతం పలికారు. న్యాయం.. ధర్మం గెలిచిందంటూ కార్యకర్తలు సంబురాలలో మునిగి తేలారు. కొత్తగూడెం చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని వనమా అభిమానులు భావోద్వేగం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, డీసీఎంఎస్ వైస్ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, కొత్తగూడెం పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ ఛైర్మన్ వేల్పుల దామోదర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.