బూర్గంపాడు, జులై 23(ప్రభ న్యూస్) : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.6 అడుగులకు చేరుకుంది. బూర్గంపాడు మండలంలో లోతట్టు ప్రాంతాలు నీరు చేరడంతో వరద ప్రాంతాల్లో భద్రాచలం ఆర్డీవో దామోదర్ పర్యటించారు. బూర్గంపాడు మండల కేంద్రంలో పలు ఇండ్లలోకి వరదనీరు చేరడంతో అధికారులు అప్రమత్తమై ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు చర్యలు వేగం చేయాలన్నారు.
మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి వసతుల గురించి వరద బాధితులను అడిగి తెలుసుకున్నారు. సారపాక నాగినేనిప్రోలు మోతే ఇరవెండి గ్రామాల్లో పర్యటించి అక్కడున్న పరిస్థితులను గ్రామస్తులను తహసీల్దార్ ముజాహిద్ ని అడిగి తెలుసుకున్నారు. వరద పెరుగుదలపై అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ముంపు ప్రాంత ప్రజలకు అండగా నిలబడాలని సూచించారు. ముంపు ప్రాంత ప్రజలు కూడా అధికారులకు సహకరించాలి కోరారు. ఆయన వెంట తహసీల్దార్ ముజాహిద్, మండల అభివృద్ధి అధికారి జమలారెడ్డి, రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు.