ఖమ్మం : తెలంగాణలోని పట్టణాలతో పాటు గ్రామాలలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందుబాటులోకి తెస్తామని అన్నారు మంత్రి కెటిఆర్.. ఖమ్మంలో ఐటీ హబ్ – 2 నిర్మాణానికి నేటి ఉదయం కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్ రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ, ఎక్కడి యువతకు అక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. . టీ ఫైబర్ పూర్తయిన తర్వాత ప్రతి ఇంటికి బ్రాడ్ బాండ్ కనెక్షన్ ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో డిజిటల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ పెంచుకుంటున్నామని అంటూ సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడికి ఉపయోగపడాలి అనే ఆలోచనతో ముందుకు పోతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పడిన సమయంలో పెట్టుబడుల విషయంలో చాలా మందికి అనుమానాలు ఉండేవని ప్రస్తావిస్తూ,. కొత్త పెట్టుబడులు కాదు.. ఉన్న పెట్టుబడులు ఇక్కడ ఉంటాయా? అనే వాదనలు వినిపించాయని అన్నారు. దక్షత కలిగిన సీఎం, స్థిరమైన ప్రభుత్వం వల్ల రెట్టింపు వేగంలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతోందని గణాంకాలతో వివరించారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడే నాటికి ఐటీ ఎగుమతులు రూ. 56 వేల కోట్లు ఉంటే.. 2021కి రూ. లక్షా 40 వేల కోట్లకు ఎగబాకిందని తెలిపారు.. సమర్థవంతమైన అధికారులు ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. దేశంలోని ఇతర నగరాలను వదిలేసి హైదరాబాద్ వస్తున్నారంటే.. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, వాతావరణ పరిస్థితులే కారణమని తెలిపారు. హైదరాబాద్‌కు మాత్రమే ఐటీని పరిమితం చేయొద్దనే ఉద్దేశంతో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరిస్తున్నామని చెప్పారు. ఖమ్మం ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్ గురించి ప్రస్తావిస్తూ, పట్టువదలని విక్రమార్కుడిలా పని చేస్తున్నారు అని ప్రశంసించారు. ఖమ్మం ప్రజలకు ఏం కావాలో అది చేసిపెట్టే నాయకుడు అజయ్ అని కొనియాడారు. ఒక పని పూర్తయ్యే వరకు ఒకే రకమైన ఏకాగ్రతతో పని చేసేవారే నిజమైన నాయకత్వం అని సీఎం అంటుంటారు. అలా అజయ్ ముందుకు పోతున్నారు. స్థానికంగా నాయకత్వం బలంగా ఉన్నప్పుడే అభివృద్ది సాధ్యమవుతుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement