ఖమ్మం ఉమ్మడి జిల్లా బ్యూరో (ప్రభన్యూస్) : భద్రాచలం వద్ద గోదావరి బుధవారం సాయంత్రం 6 గంటలకు 46.20 అడుగులకు చేరినట్లు కలెక్టర్ ప్రియాంక తెలిపారు. గోదావరి నుండి 10 లక్షల 59 వేల 950 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
వరద ఉధృతి దృష్ట్యా ప్రజలు జిల్లా యంత్రాంగం సలహాలు, సూచనలు పాటించాలని కలెక్టర్ చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయాలని, ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావొద్దన్నారు. పొంగిపొర్లుతున్న వాగులు దాటొద్దని చెప్పారు. రహదారులపైకి నీరు చేరిన ప్రాంతాల్లో ప్రజలు రవాణా చేయడానికి అవకాశం లేకుండా బారికేడింగ్, ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ, పంచాయత్ రాజ్
సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.