ఇల్లందు, (ప్రభ న్యూస్): ఖమ్మం జిల్లాలోని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఇవ్వాల (శుక్రవారం) జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రభుత్వ వైద్యశాలలోని ఫ్రిజ్, వివిధ పరీక్షలకు సంబంధించిన పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. వీటి విలువ సుమారు 3 లక్షల పైగా ఉంటుందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల వైద్య విధాన పరిషత్ లోకి మారిన తర్వాత పూర్తిస్థాయిలో రిపేర్లు చేపట్టారు.
ఇందులో భాగంగానే విద్యుత్ సౌకర్యాన్ని కూడా మెరుగు పరిచారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది స్థానిక ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పేశారు. దీంతో ఎవరికీ ఇబ్బంది కలగలేదని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.