Sunday, November 24, 2024

KHM: కారేపల్లి క్రాస్ రోడ్ చెక్ పోస్ట్ వద్ద సీపీ ఆకస్మిక తనిఖీలు

కారేపల్లి, మార్చి28 (ప్రభ న్యూస్) : ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. గురువారం ఖమ్మం రూరల్ డివిజన్ పరిధిలోని కారేపల్లి క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లాలో మోహ‌రించిన కేంద్ర పోలీసు బ‌ల‌గాలతో పాటు స్ధానిక పోలీసులు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సరిహద్దులో పటిష్టమైన చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామని, జిల్లాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని, నగరం నుంచి వెళ్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు, నగలు, ఇతరత్రా సొత్తును సీజ్‌ చేసి సంబంధిత అధికారులకు అప్పగిస్తారని తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ.50వేలకు మించి నగదు తీసుకువెళ్లరాదని, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలని సూచించారు. జిల్లాలో 12ఎఫ్ఎస్టి, 15ఎస్ఎస్టి, 2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్టులు, 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 24 గంటలు గట్టి నిఘా ఉంచామని తెలిపారు. తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement