తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ మొదలైంది. భట్టి విక్రమార్క పాదయాత్రతో మొదలైన మార్పు, ముగింపు వేళకు వచ్చే సరికి పూర్తి అనుకూలంగా మారింది. భట్టి పాదయాత్రకు ముందు – తరువాత అన్నట్లుగా పార్టీలో మార్పు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు హైకమాండ్ ను కదలించిన అంశం. భట్టి పీపుల్స్ మార్చ్ ముగింపు సభకు రాహుల్ ను తరలి వచ్చేలా చేసింది కూడా ఇదే అంశం. 109 రోజుల పాటు మండుటెండల్లో 1300 కి.మీ నడిచిన భట్టిని పార్టీ తరపున రాహుల్ సత్కరించనున్నారు. ఖమ్మం వేదికగా పార్టీలో ముఖ్య నేతల చేరికలు జరగనున్నాయి. తాజా పరిణామాల నడుమ సెంట్రల్ టీమ్స్ రంగంలోకి దిగి మేధావులతో భేటీలు నిర్వహిస్తున్నారు. సభ సక్సెస్ అవ్వటం ఖాయమని గ్రహించిన రేవంత్ అలర్ట్ అయ్యారు.
ఖమ్మం సభ ఏర్పాట్ల పైన పర్యవేక్షణకు రంగంలోకి దిగారు. తెలంగాణలో కాంగ్రెస్ కు ఈ స్థాయి ఆదరణ తిరిగి దక్కుతుందని పార్టీ ముఖ్యులే అంచనా వేయలేదు. పార్టీ కోసం భట్టి చొరవ తీసుకొని పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో బాధ పడుతున్న వారికి అండగా నిలిచారు. పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలతో మమేకమయ్యారు. ఈ బాధల నుంచి విముక్తి కావాలంటే కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ రాజ్యం అవసరమని వివరించారు. ఈ ఆదరణ కాంగ్రెస్ నేతలను కదలించింది. శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అప్పటి వరకు ఎవరికి వారుగా ఉన్న నేతలంతా ఒక్కటయ్యారు. ఈ ఐక్యత, ఆదరణ కాంగ్రెస్ హైకమాండ్ ను ఆకర్షించింది. భట్టి యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కు కారణమైన భట్టి యాత్ర ముగింపు సభకు రాహుల్ తరలి వస్తున్నారు. లక్షలాది మంది సమక్షంలో భట్టి విక్రమార్కను సన్మానించనున్నారు.
ఇప్పుడు ఖమ్మం సభ పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. పార్టీకి పెరిగిన ఆదరణ..భవిష్యత్ కార్యాచరణ పైన వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఖమ్మంలో జరగనున్న జనగర్జన తెలంగాణ రాజకీయ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు ఏర్పాట్లు భారీ ఎత్తున ఉండటం, కాంగ్రెస్ పై ప్రజల ఆదరణ, కార్యకర్తల్లో జోష్, ఇవన్ని పెరగటం చూసిన అధికార పార్టీలో ఆందోళన మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా పొరుగు జిల్లాల పైన ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని ఇప్పటికే నిఘా సంస్థలు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. ఖమ్మంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా తమ పట్టు జారుతోందనే ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. ఖమ్మం సభా వేదికగా జరిగే చేరికలు, రాహుల్ తెలంగాణ ప్రజల కోసం ఇవ్వనున్న హామీలు ఇప్పుడు ఎన్నికల వేళ బీఆర్ఎస్ – బీజేపీకి సవాల్ గా మారుతున్నాయి. ఖమ్మం సభ వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది.
ఖమ్మం సభ నిర్వహణపైన ఇప్పటి వరకు రేవంత్ అంటీ ముట్టనట్లు ఉన్నారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రే నేరుగా భట్టి వద్దకు వెళ్లి సభా నిర్వహణపైన చర్చించారు. అ చర్చలకు పొంగులేటిని ఆహ్వానించారు. సభకు జనగర్జనగా అక్కడే పేరు ఖరారు చేసారు. థాక్రే రాష్ట్రంలోనే మకాం వేసారు. సభ జరిగే రోజున రాహుల్ గాంధీ వస్తుండటంతో మొదట టీపీసీసీ అధ్యక్షుడిగా సభ వరకు పరిమితం అయ్యేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. కానీ మారుతున్న పరిణామాలు, నేరుగా రాహుల్ టీమ్ సభ పైన ఫోకస్ చేయటం, సభ గ్రాండ్ సక్సెస్ అవ్వటం ఖాయంగా కనిపిస్తుండటంతో ఇప్పుడు రేవంత్ ఖమ్మం బాట పట్టారు. ముందస్తు ఏర్పాట్లపై పర్యవేక్షణకు రంగంలోకి దిగారు. ఆలస్యం చేస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించారు. ఇప్పుడు ఖమ్మం మొత్తం భట్టి పాదయాత్ర ముగింపు, పొంగులేటి చేరిక కేంద్రంగా నిర్వహణకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.