అశ్వరావుపేట, (ప్రభ న్యూస్): బేతుపల్లి గంగారంలో గల సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల అంటే ఒకప్పుడు రాష్ట్రస్థాయిలోనే పేరెన్నిక గల కళాశాలగా పేరు ఉండేది కానీ ఇటీవల కాలంలో జరుగుతున్న విద్యార్థులు గొడవల వలన కళాశాల కీర్తిప్రతిష్టలు మసకబారే పరిస్థితి ఏర్పడింది. తాజాగా సోమవారం కూడా కళాశాల విద్యార్థులు ముష్టి యుద్ధానికి దిగటం సంచలనం రేపింది. దీనిపై వివరాల్లోకి వెళితే కళాశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్పోర్ట్స్ లో పాల్గొనే విద్యార్థుల కొరకు బస్సులను కొద్దిసేపు ఆపి ఆ తర్వాత వారు వచ్చిన తర్వాత బస్సులు వెళ్లడం జరుగుతుంది. దీనివలన స్పోర్ట్స్ ఆడే విద్యార్థుల కోసం బస్సులు ఆపారని కొంతమంది విద్యార్థులు ఈ విషయమై వాగ్వాదానికి దిగారు. ఈ విషయమై అశ్వరావుపేటకు చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థితో పాటుగా కొంతమంది విద్యార్థులు కళాశాల బస్సు గంగారం నుండి అశ్వరావుపేటకు వస్తున్న మార్గమధ్యలో క్రీడల నిర్వహణ వేళ విద్యార్థుల కోసం బస్సును నిలుపుదల చేస్తున్న విషయమై సెకండ్ ఇయర్ విద్యార్థులకు థర్డ్ ఇయర్ విద్యార్థులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.
ఈ క్రమంలో మండలంలోని ఆసుపాక గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు తోపాటుగా మరి కొంతమంది సీనియర్ విద్యార్థులు పేటకు చెందిన సెకండియర్ విద్యార్థి తో పాటుగా అతని మిత్రులపై దాడి చేసి దుస్తులను చింపివేశారు. ఈ తతంగం అంతా గట్టు గూడెం సమీపంలో జరగగా బస్సు మందలపల్లి వచ్చేసరికి దెబ్బలు తిన్న యువకులు అశ్వరావుపేటలోని వారి కుటుంబ సభ్యులకు మిత్రులకు ఫోన్ చేయటంతో హుటాహుటిన పలు వాహనాల ద్వారా వాళ్ళు మందలపల్లి కి రావడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ బస్సు ఆగటంతో బస్సులో ఉన్న వారికి బయటి నుంచి వచ్చిన వారికి స్వల్ప స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో దమ్మపేట పోలీసులు తక్షణమే స్పందించి గొడవ జరగకుండా చూసి బస్సును తక్షణమే అక్కడనుండి అశ్వరావుపేటకు పంపించి వేశారు.
అశ్వరావుపేటకు బస్సు రాగానే బస్సు డ్రైవరు వెంటనే పోలీస్ స్టేషన్ ఎదుట బస్సును ఆపి స్టేషన్ లో జరిగిన విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అశ్వరావుపేట నుంచి మందలపల్లి వెళ్లిన యువకులను సీనియర్ జూనియర్ విద్యార్థులను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ విషయమై సీనియర్ విద్యార్థులు మాట్లాడుతూ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఓ సీనియర్ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించారని అందుకే తాము చేయి చేసుకోవాల్సి వచ్చిందని పోలీసుల ఎదుట తమ వాదనను వినిపించారు. ఇది సరికాదని అటువంటి పని మేము చేయలేదని కావాలనే లేనిపోని ఆరోపణ చేస్తున్నారని సెకండ్ ఇయర్ విద్యార్థులు ప్రత్యారోపణ చేశారు. దీంతో పోలీసులు ఇరువురు వాదనలు విన్న తర్వాత మరో మారు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని మరో మారి ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే అందరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి స్టేషన్ నుంచి పంపించి వేశారు