అశ్వాపురం: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 20 వరకు జరగబోవు ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ సత్య ప్రకాష్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షా కేంద్రంలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 81, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 109మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతి లేదని, విద్యార్థులు సకాలంలో ఉదయం 8.30 గంటలలోపు తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని సూచించారు. పరీక్షలు ప్రశాంతంగా జరగటానికి కళాశాల చుట్టుపక్కల 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షా కేంద్రానికి డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా గరుడాచలం వ్యవహరించనున్నారు. పరీక్ష కేంద్రంలో అన్ని వసతులు ఏర్పాటు చేయటానికి సహకరించిన వైద్య, రెవిన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, ఇతర శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.