అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వరద ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ తెల్లవారు జామునుండే విస్తృతంగా పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కలిసి తక్షణమే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని సూచించారు.
గోదావరి వరద ఉదృతి 68 అడుగులకు పెరిగిన దృష్ట్యా ఇంకా పెరిగి 75 అడుగుల వరకు వస్తుందన్న సమాచారం మేరకు ముందస్తు చర్యలో భాగంగా భద్రాచలం పట్టణం ఏఎంసీ కాలనీ, సుభాష్ నగర్, శాంతి నగర్, మిథిలా స్టేడియంలో వరుద నీరు చేరడంతో ఆయా ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మోకాళ్ల లోతులో నీళ్లలో మంత్రి పువ్వాడ స్వయంగా వెళ్ళి ప్రజలను తరలించారు. ముంపుకు గురైన వివిధ ప్రాంతాలలో ప్రజలను తక్షణమే తరలించాలని, అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.