ఖమ్మం – మున్నేరు వాగు కనుక పొంగితే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోతాయి. నష్టం ఎక్కువగా వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే 16 అడుగులకు నీటి మట్టం చేరడం తో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు
భారీ వర్షాలు, వరద హెచ్చరిక ల నేపథ్యం లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లు రాత్రి నుంచి ఖమ్మంలో మకాం వేశారు.
ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగానే హెచ్చరించాలని అధికారులకు సూచించారు భట్టి. వరద ఉద్ధృతి మీద అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లను ఆదేశించారు.
ఆందగా ఉంటాం – భట్టి
భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాం అని తెలిపారు భట్టి. ఖమ్మం పట్టణంలోని స్వర్ణ భారతి పునరావాస శిబిరంలో వరద ముంపు బాధితులని కలిసి పరామర్శించి మనో ధైర్యం నింపారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆహారం, నీళ్లు అందుబాటులో ఉండేలా మిగతా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలకు కురుస్తుండటంతో మున్నేరుకు వరద ఉద్ధృతి పెరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వరదల రాకుండా ఉండేందుకు, వచ్చినా ఎక్కువ నష్టం జరగకుండా చూసుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోందని.. సహాయక శిబిరాలను మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించామని తుమ్మల తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు వెళ్లాలని కోరారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.
ఇక మంత్రి సీతక్క ఆ జిల్లా అధికారులతో అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే మున్నేరు వరద పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి.. వారికి కావాల్సిన ఆహార, ఇతర ఏర్పాట్లను చూడలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు ఇచ్చారు