గొలుసుకట్టు చెరువుల ఆక్రమణతో ప్రమాదం
ఆక్రమణలన్నింటినీ వరుసగా తొలగిస్తాం
విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేస్తున్నాం
మున్నేరు రిటర్నింగ్ వాల్ ఎత్తు పెంచాల్సిన అవసరం ఉంది
మంత్రులంతా ప్రజలతోనే ఉన్నారు
ముంపు ప్రాంతాల పర్యటనలో సీఎం రేవంత్
ఆంధ్రప్రభ స్మార్ట్, ఖమ్మం :
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విపత్తు చూసి చలించిపోయానని, ప్రకృతిని ధ్వంసం చేయడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం పర్యటనకు వెళ్లే ముందు కాసేపు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అనేక నగరాల్లో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. ఖమ్మం నగరంలో కూడా గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలకు గురికావడంతో పెద్ద స్థాయిలో వరదలు వచ్చాయని, భారీ నష్టం కలిగిందన్నారు. ప్రస్తుతానికి గొలుసు కట్టు చెరువులు మాయమయ్యాయని చెప్పారు.
మున్నేరుకు రిటైర్నింగ్ వాల్ పెంచాలి
ఖమ్మం నగరంలో మున్నేరు నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు ముంపు కాకుండా రిటైర్నింగ్ వాల్ ఎత్తు పెంచాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఇంజనీర్లతో మాట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రిటర్నింగ్ వాల్ నిర్మిస్తే ఖమ్మం ముంపు నుంచి బయట పడుతుందని చెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు.
చెరువుల ఆక్రమణల తొలగింపు
ఖమ్మం నగరంలో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ప్ ద్వారా చెరువులను గుర్తించి, ఆక్రమణలు తొలగిస్తామని సీఎం తెలిపారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. చెరువులు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పటిష్టం చేశామని , గతంలో తెగని చెరువులు , ఇప్పుడు ఎందుకు తెగుతున్నాయని అన్నారు.
75 ఏళ్ల తర్వాత…
ఖమ్మంలో 75 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని, 42 సెంటీమటర్ల వర్షం పడిందని సీఎం చెప్పారు. ఎంతో విపత్తు జరిగినా ప్రాణ నష్టాన్ని తగ్గించామని చెప్పారు. ఇది ప్రభుత్వం ముందు చూపే అని అన్నారు.
పువ్వాడ ఆక్రమణలు.. తొలగించాలని హరీశ్‌కు చెప్పండి
వరదలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ నాయకుడు పువ్వాడ అజయ్ కాలువ ఆక్రమించి హాస్పటల్ నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పువ్వాడ ఆక్రమణలను హరీశ్ రావు దగ్గరుండి తొలగించేలా ప్రజలు గుర్తు చేయాలని సూచించారు.
మంత్రులు ప్రజలతోనే ఉన్నారు..
రాష్ట్రంలో జరిగిన విపత్తుపై కేంద్రానికి లేఖ రాశామని, మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాలయ ఎక్స్‌గ్రేషియా ఇచ్చామని సీఎం అన్నారు. మా మంత్రులంతా ప్రజలతోనే ఉన్నారన్నారు. ఇలాంటి విపత్తుల సమయంలో గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. మాది చేతల ప్రభుత్వం అన్నారు. ప్రజలకు ఏదీ కావాలన్నా మమ్మల్ని అడుగుతారని, నిలదీస్తారని, ఫామ్ హౌస్‌లో ఉన్న వారిని ఎందుకు నిలదీస్తారన్నారు. ప్రత్యేకంగా విపత్తు నిర్వహణ సంస్థను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.