జల దిగ్బంధనంలో చిక్కుకున్న ఖమ్మం
వంగవీడు వాగులో కొట్టుకుపోయి ఒకరు మృతి
మరో పదహారు మంది గల్లంతు
ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారికి గండి
హైదరాబాద్‌కు నిలిచిన రాకపోకలు
పరిస్థితిని పర్యవేక్షిస్తున్నడిప్యూటీ సీఎం భట్టి
అధికారులను అప్రమత్తం చేసిన మంత్రుల తుమ్మల, పొంగులేటి
ఆంధ్రప్రభ స్మార్ట్, ఖమ్మం బ్యూరో :
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షం సృష్టించి బీభత్సంతో జనజీవనం స్తంభించింది. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. మధిర వద్ద వంగవీడు వాగులో నీటి ఉధృతికి ఇద్దరు కొట్టుకుపోవడం గమనించి సహాయక బృందాలు ఒకరిని రక్షించారు. మరొకరు మృతి చెందారు. అలాగే ఆకేరునదిలో ఐదుగురు గల్లంతయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. ఖమ్మం-సూర్యాపేట మధ్య జాతీయ రహదారికి గండి పడింది. దీంతో ఖమ్మం-హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వర్షాప్రభావ ప్రాంతాలను పర్యటించి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా పరిస్థితి సమీక్షిస్తున్నారు.
ఖమ్మం జలదిగ్బంధం
ఖమ్మం నగరంలో మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీరు 27.5 అడుగుల స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హచ్చరికను ఎగురవేశారు. నదికి ఇరువైపులా ఉన్నప్రజలను అప్రమత్తం చేశారు. నదికి ఇరువైపుల ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. మున్నేరు నది పరిసర ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉంది. వందల సంఖ్యలో ఇళ్లకు నీరు చుట్టుముట్టింది. నది నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో డాబాల మీదుకు నివాసితులు వెళ్లిపోయారు.
సహాయం కోసం ఎదురు చూపు
ఖమ్మం నగరంలోని మున్నేరు నది పొంగడంతో జలదిగ్బంధంలో చిక్కుకున్నప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమను ఆదుకోవాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. వర్షం బోరున పడుతుండడంతో చురుగ్గా సహాయ కార్యక్రమాలు ముందుకు వెళ్లడం లేదు.
42 సెంటిమీటర్ల వర్షపాతం
ఖమ్మం జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో నగరానికి ఒకవైపు మున్నేరు వరద పోటు, మరో వైపు వర్షపు నీరుతో అతలాకుతలమైంది. ఖమ్మం జిల్లాలోని కాకరవాయిలో అత్యధికంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం, భద్రచలంలో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, పాలేరు, సత్తుపల్లి, వైరా, మధిర, కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాలలో వర్ష బీభత్సం నెలకొంది.
ఒకరు మృతి… ఒకరు సేఫ్.. 16 మంది గల్లంతు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నది ప్రవాహాల్లో 18 మంది గల్లంతయ్యారు. ఇందులో ఒకరు మృతి చెందగా, మరొకరిని సహాయక బృందాలు రక్షించారు. ఖమ్మం రూరల్ మండలంలో వాల్య చెరువు తెగిపోవడంతో పది మంది గల్లంతయ్యారు. మండలంలో ఆకేరు నది ప్రవాహాన్ని చూడడానికి వెళ్లిన ఆరుగురు వరదలో కొట్టుకుపోయారు. మధిర వంగవీడు వాగులో ఒకరు కొట్టుకుపోగా, మరొకరిని సహాయక బృందాలు రక్షించాయి.
ఉపముఖ్యమంత్రి భట్టి సమీక్ష
వర్షాలు వరదల నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భారీ వర్షం నేపథ్యంలో మధిర ప్రాంతంలో వరదలు రావడంతో శనివారం రాత్రి హుటాహుటిన మధిరకు చేరుకున్న ఆయన వరద పరిస్థితులను, సహాయక చర్యలను సమీక్షించారు. ఖమ్మం కలెక్టరేట్ నుండి ఆదివారం మధ్యాహ్నం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వరద పరిస్థితిపై సమీక్షించారు. ప్రజలను కాపాడేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వర్షాలు వరదల పరిస్థితులపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.