Wednesday, November 20, 2024

Khammam : జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట.. జడ్పీ చైర్మన్ లింగాల

ఖమ్మం : రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. టియుడబ్ల్యూజే (ఐజేయు) నగర కమిటీ, ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సౌజన్యంతో ..జిల్లా పరిషత్ కార్యాలయంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు , ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి . మాలతి, టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రామనారాయణ ప్రారంభించారు. కంటి వెలుగు శిబిరాన్ని , కంటి పరీక్షలను వారు ప్రారంభించి రీడింగ్, సైట్ కంటి అద్దాలు కొన్నింటిని అప్పటికప్పుడే అందజేశారు.

జర్నలిస్టు యూనియన్ ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మైస పాపారావు అధ్యక్షతన ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. కాగా ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధిని కేటాయించడంతోపాటు.. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్రంలో లక్షలాది మందికి ఉచితంగా కంటి అద్దాలు అందిస్తూ.. చూపును ప్రసాదిస్తున్నారని లింగాల కమల్ రాజు అన్నారు. ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. జర్నలిస్టులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, పదేళ్లలో ఎన్నో అద్భుత విజయాలు సాధించారని పేర్కొన్నారు. ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారధ్యంలో త్వరలో ఖమ్మంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కళ సాకారం కానుందని పేర్కొన్నారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి అండగా ఉండాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement