ఖమ్మం : నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ఓ సినీ కవి రాసిన పాట ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిపోయిందని, నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకునే రోజులు వచ్చాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రేడియోలజి ల్యాబ్, డయాలసిస్ సెంటర్, కీమోతెరఫీ వార్డులను మంత్రి పువ్వాడ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సమకూర్చిన న్యూట్రిషన్ కిట్స్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు ఇదే హాస్పిటల్ లో కనీసం సరిపడా డాక్టర్స్ ఉండేవారు కాదు, స్వల్ప సంఖ్యలో నర్సులు, సిబ్బంది ఉండే వారని.. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఏ విభాగంకు ఆ విభాగంలో ప్రత్యేక వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారని అందుకు ప్రభుత్వంకు మంత్రి హరీష్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. ఒకప్పుడు 250 పడకలలోనే 500 మంది రోగులు, ఒక్కో బెడ్ కు ఇద్దరు పేషంట్స్ ఉండేవారని ఇవన్నీ తనకి స్వయంగా తెలుసని అన్నారు. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 500 బెడ్స్ కు పెంచుకున్నమని, దీనికి తోడు ప్రత్యేక మాతా శిశు కేంద్రం, ట్రామా కేర్, క్రిటికల్ కేర్ యూనిట్, డయాలసిస్ ఇలా అనేక సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. గర్భిణిల కోసం ఆరోగ్య మహిళ పథకం, కంటి వెలుగు పథకం ద్వారా కొన్ని లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు చేపట్టి లక్షల మందికి కంటి అద్దాలను పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఏ వైద్య పరీక్ష కావాలన్నా.. ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేస్తారని సూచించారు.
నేడు వరల్డ్ బ్లడ్ డొనర్స్ డే సందర్భంగా మంత్రి పువ్వాడ రక్త దానం చేశారు.అనంతరం జిల్లాలో పని చేస్తున్న ఉత్తమ వైద్యులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు, మెమెంటోలు బహుకరించి అభినందించారు.కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబవాల కోటేశ్వర రావు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, DMHO డాక్టర్ బి మాలతీ, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఆర్ వి ఎన్ సాగర్, నందగిరి శ్రీను, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వర రావు, ఆసుపత్రి సూరింటెండెంట్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.