Friday, September 13, 2024

Khammam – తెలంగాణ పథకాలుదేశానికే ఆదర్శం – ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి

ఖ‌మ్మంలో జాతీయ జెండావిష్క‌ర‌ణ
వైద్య క‌ళాశాల‌కు శాశ్వ‌త భ‌వ‌నాలు
ధరణి స్థానంలో రెవెన్యూ చ‌ట్టం
సీతారామ ప్రాజెక్టుతో ఖ‌మ్మం జిల్లాకు గోదారి జ‌లాలు
మైనింగ్ ప్ర‌భావిత ప్రాంతాల్లో అభివృద్ధికి చ‌ర్య‌లు
స్ప‌ష్టం చేసిన ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఖ‌మ్మం బ్యూరో :
త‌మ‌ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రగతిశీల విధానాలు, ఆర్ధిక క్రమశిక్షణతో ఎనిమిది నెలల కాలంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామ‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని స్ప‌ష్టం చేశారు. గురువారం ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జ‌రిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. త‌మ ప్ర‌భుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతూ.. మహిళలు, రైతుల సంక్షేమానికి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుంద‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలలో ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలుపుతామన్నారు. రాష్ట్ర ప్రగతి, జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమం జిల్లా ప్రజలకు వివరించారు.

- Advertisement -

ధరణి స్థానంలో రెవెన్యూ చ‌ట్టం

ధరణి స్థానంలో అత్యుత్తమ రెవెన్యు చట్టం రూపకల్పనకు ప్ర‌భుత్వం చర్యలు చేపట్టిందని డిప్యూటీ సీఎం భ‌ట్టి తెలిపారు. జిల్లాలో 91, 799 మందికి 520.77 కోట్లు రుణ‌మాఫీ వ‌ర్తించింద‌ని భ‌ట్టి అన్నారు. మూడవ విడతలో అమలు చేస్తున్న రూ.2 లక్షల రుణమాఫీతో జిల్లాలో 3.38 లక్షల రైతు కుటుంబాలకు రూ. 5689.20 కోట్ల రుణమాఫీ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో క్రీయాశీలక భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందు ఉందన్నారు. రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించడం వల్ల ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకూ 1 కోటి 58 లక్షల 45 వేల 142 మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, దీని ద్వారా మహిళలకు రూ. 6737.39 లక్షల లబ్ధిచేకూరిందని అన్నారు.

వైద్య క‌ళాశాల‌కు శాశ్వ‌త భ‌వ‌నాలు

ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలకు శాశ్వత భవనాల కోసం బల్లేపల్లి, రఘునాధపాలెం మండల కేంద్రంలోని 40 ఎకరాల భూమిని కేటాయించామని, త్వరలోనే భవనాల నిర్మాణం ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. జిల్లాలోని సత్తుపల్లి, పాలేరులలో నర్సింగ్ కళాశాలల భ‌వ‌న‌ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రతి మండలంలో ఇంటిగ్రేటేడ్ పాఠశాలల సముదాయం ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని, పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఏడాది కొడంగల్, మధిర లో ప్రారంభించ‌నున్నామ‌ని తెలిపారు. జిల్లాలో 955 పాఠశాలల అభివృద్ధి పనులు చేపట్టి, ఇప్పటివరకు రూ. 12 కోట్లతో 592 పాఠశాలల్లో అన్ని వసతులు పూర్తి చేశామన్నారు.

సీతారామ ద్వారా గోదావ‌రి జ‌లాలు

సీతారామ లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఏన్కూర్ వద్ద రూ. 77.05 కోట్ల వ్యయంతో 8.69 కి.మీ. మేర రాజీవ్ లింక్ కెనాల్ నిర్మించి 7,115 ఎకరాల కొత్త ఆయకట్టు గోదావ‌రి జ‌లాలు అందివ్వ‌నున్న‌ట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. రూ. 16692.06 లక్షల అంచనాలతో చెక్ డ్యాం లు, ఆనకట్ట బ్యాలెన్స్ పనులు, మీడియం ఇర్రిగేషన్ ఆధునికీకరణ పనులు, సాగునీటి వనరుల కాల్వల నిర్వహణ పనులు వివిద దశల్లో పురోగతిలో ఉన్నాయని వివరించారు.

డీఎంఎఫ్‌టీ నిధుల‌తో మైనింగ్ ప్ర‌భావిత ప్రాంతాల అభివృద్ధి

డీఎంఎఫ్‌టీ నిధులను మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో గ్రామాల సంక్షేమ మరియు మౌలికవసతుల కల్పన వంటి పనులకు వినియోగిస్తామని డిప్యూటీ సీఏం చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 110.72 కోట్లతో 52.78 లక్షల పని దినాలను కల్పించమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement