Friday, November 22, 2024

Khammam – ఆర్టీసీ బ‌స్సులో ఉప ముఖ్య‌మంత్రి భట్టి – మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కంపై ఆరా

ఖమ్మం : ఖమ్మం పాత బస్టాండ్ నుంచి బోనకల్ మండలం జగన్నాధపురం వరకు సామాన్యుడిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రయాణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మహాలక్ష్మి పథకం అమలవుతున్న వివరాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం చాలా బాగుంది, ఆర్థికంగా వెసులుబాటు అవుతుందని డిప్యూటీ సీఎం భట్టితో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఉచితంగా ప్రయాణం చేసే మహిళలకు జారీచేస్తున్న జీరో టికెట్ల విధానం గురించి కండక్టర్ శైలజను అడిగి తెలుసుకున్నారు.

బ‌స్సులో ప్రయాణిస్తున్న నాగులవంచ గ్రామానికి చెందిన జానమ్మ, అనంతమ్మ ల తో ముచ్చటిస్తూ కరెంటు మంచిగా వస్తుందా ? ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎలా ఉంది ? ఎన్నిసార్లు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు ? అని ప్ర‌శ్నించారు.. దీంతొ వారు బడి గుడి పెళ్లి పేరంటాలకు ఉచిత బస్సులు వెళ్లడం వల్ల ఆర్థికంగా కొంత వెసులు బాటు అవుతుందని పేర్కొన్నారు.

పల్లె వెలుగు బస్సులో మహాలక్ష్మి లతో కలిసి ప్రయాణించడం చాలా సంతోషంగా ఉందనీ భట్టి అన్నారు. ఫ్రీ ప‌థ‌కం వ‌ల్ల మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు అని హ‌ర్షం వ్యక్తం చేశారు. మహిళలకు రాష్ట్రంలో ఉచిత ప్రయాణం అమలు చేయడం వల్ల ఆర్టీసీ బలోపేతం అవుతుందని, కొత్తగా 300లకు పైగా బస్సులు కొనుగోలు చేశామని చెప్పారు. అంతేకాకుండా ఆర్టీసీ విస్తరణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ప్రయాణికుల సంఖ్య బస్సుల్లో పెరిగినందున కొత్త బస్సులు కావలసిన అవసరం ఏర్పడుతున్నట్లు అంగీకరించారు.

స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు రుణాలు ఇప్పించి వారితో బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీలో పెట్టాలన్న ఆలోచన చేస్తున్నామనీ భట్టి పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే త‌మ‌ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రాష్ట్రంలో 92 శాతం ఉన్న బలహీన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా త‌మ‌ ప్రభుత్వ పనితీరు ఉంటుందనీ తెలిపారు.

- Advertisement -

తొలుత ఖమ్మం పాత బస్టాండ్ లో పాతర్లపాడు గ్రామానికి వెళ్లేటువంటి ఆర్టీసీ బస్సును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్,జిల్లా కలెక్టర్ గౌతం, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకన్న , డిపో మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement