ఖైరతాబాద్ గణేషుడు ఈ సారి సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నారు. 70 ఏండ్ల ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రస్థానంలో తొలిసారి 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు
స్వామి వారికి రెండు వైపుల అయోధ్య శ్రీబలరాముడు, రాహు, కేతులతో పాటు శ్రీ లక్ష్మీ శ్రీనివాసుడు, పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను భక్తులకు కనువిందు చేస్తున్నారు.
ఖైరతాబాద్ బడా గణేషుడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి స్వామివారి తొలిపూజలో పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ.. 70 ఏండ్ల నుంచి దేశం దృష్టినంతా ఆకర్షించేలా వినాయకుడి ఉత్సవాలను నిర్వహిస్తున్నారన్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు తెలంగాణకే గర్వకారణమని చెప్పారు. నిష్టతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా శాంతి, మతసామరస్యం, పాడిపంటలతో రాష్ట్రం వర్ధిల్లుతుందని తెలిపారు.ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నదని చెప్పారు. హైదరాబాద్‌లో 1.40 లక్షల గణేషుడి విగ్రహాలను నెలకొల్పారని, మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.
అకాల వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భారీ వరదలు వచ్చినప్పటికీ తక్కువ నష్టంతో బయటపడ్డామని వెల్లడించారు.
అంతకుముందు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన వినాయకుడి పూజలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ దంపతులు కూడా పాల్గొన్నారు
. కాగా, ఖైరతాబాద్ మహాగణపతికి ప్రతి ఏడాది గవర్నర్ తొలిపూజ నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతున్నది. . సాయంత్రం 3గంటల ప్రాంతంలో తెలంగాణ గవర్నర్ హాజరవుతారని ఉత్సవ కమిటీ తెలిపింది.