బకాయిలు చెల్లించకపోవడంతో
స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ అధికారులు
హైకోర్టు ఆదేశాలు పాటించామని ప్రకటన
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్మించిన జీవన్‌రెడ్డి మాల్‌ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్టీసీ నిబంధనల ప్రకారం సంస్థతో చేసుకొన్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
బకాయిలు చెల్లించడం లేదని ఆర్టీసీ అధికారులు ఈ నెల 9న మాల్‌లోని అద్దె దుకాణదారులకు ప్రకటన జారీ చేశారు. నోటీసులు అందజేయడంతో అదేరోజు సంస్థ ప్రతినిధులు కొంత మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చారు. దీంతో స్వాధీనం చేసుకొనే నిర్ణయాన్ని వాయిదా వేశారు.
ఆర్టీసీ ఉన్నతాధికారులపై విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ యజమాని రజితారెడ్డి భర్త మాజీ ఎమ్మెల్యే , బిఆర్ఎస్ నేత జీవన్‌రెడ్డి ఇటీవల పలు ఆరోపణలు చేశారు.దీంతో మరోసారి మాల్‌కు వచ్చిన అధికారులు మార్చి 27న పూర్తి బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినట్లు పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబరు నాటికి రూ.8.65 కోట్ల బకాయిలు ఉండగా.. విడతల వారీగా కొంత మొత్తాన్ని చెల్లించారు.
కాగా రూ.2.51 కోట్ల బకాయిలు ఉన్నాయని, హైకోర్టు ఆదేశాల ప్రకారం నెల రోజుల గడువు ఇచ్చామని, చెల్లించకపోవడంతో నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. అద్దె దుకాణదారులు, వినియోగదారులను బయటకు పంపించి గేటుకు తాళం వేశారు.