ఇంటర్ ప్రవేశాల గడువు పై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ ప్రవేశాల గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ కాలేజీల్లో ఫస్టియర్‌లో ప్రవేశాలకు మరోసారి అవకాశం కల్పించింది. ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులు రూ.500 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షల నిమిత్తం అదనంగా రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ విద్యార్థులు రూ. 710 చెల్లించాలి. రూ.100 ఆలస్యం రుసుంతో డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ మధ్యలో చెల్లించొచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 8 నుంచి 12వ తేదీ మధ్యలో చెల్లించొచ్చు. రూ. 1000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 14 నుంచి 17వ తేదీ వరకు, రూ. 2000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 19 నుంచి 22వ తేదీ మధ్యలో చెల్లించొచ్చని తెలిపింది.
అర్హత గల విద్యార్థులు నవంబర్ 27వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు. ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్‌కు సంబంధించి పరీక్ష ఫీజు స్వీకరణ కొనసాగుతుంది. నవంబర్ 30వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించొచ్చు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించొచ్చని బోర్డు తెలిపింది.