కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 288కి చేరుకుంది. అయితే.. ప్రమాదానికి కేంద్ర స్థానమైన చూర్‌మలాలో గురువారం రాహుల్ గాంధీ, ప్రియాంకా పర్యటించారు. అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించారు. మెప్పాడిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో బాధితులను కలుసుకున్నారు. అక్కడ నుంచి డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీకి వెళ్తున్నారు. మెప్పాడీలో రెండు రిలీఫ్ క్యాంప్‌లు ఉన్నాయి.
రాహుల్, ప్రియాంకాలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ 2019లో గెలుపొందారు. ఆ తర్వాత ఈ ఏడాది ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. కానీ రాయ్‌బరేలీలో కూడా లోక్‌సభ స్థానాన్ని నెగ్గడంతో.. వయనాడ్ స్థానాన్ని ఆయన వదులుకున్నారు. అయితే వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ .. ఉప ఎన్నికల్లో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఉదయం కన్నూర్ విమానాశ్రయంలో రాహుల్, ప్రియాంకాలు దిగారు. రోడ్డు మార్గం ద్వారా వయనాడ్ వెళ్లారు.