Friday, July 5, 2024

TG | ప‌ద‌వులు లేకుండా నాలుగు రోజులు ఉండ‌లేరా… కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఈరోజు (మంగళవారం) బీఆర్‌ఎస్ పార్టీ జెడ్పీ చైర్మన్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అత్యున్నత పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీని వీడుతున్న నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు… పదవులు లేకుండా నాలుగు రోజులు ఉండలేరా? పార్టీని వీడుతున్న వారిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందని ధీమా వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని జెడ్పీ చైర్మన్‌లందరూ రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించార‌ని కేసీఆర్ అన్నారు. పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మీరందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని… అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసేవారే నిజమైన రాజకీయ నాయకులని అన్నారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతా సజావుగా సాగిందని… కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు, తాగునీరు, శాంతి భద్రతల సమస్యలు వచ్చాయని విమర్శించారు. మతపరమైన అల్లర్లు చెలరేగడం కూడా బాధాకరం అని అన్నారు. అప్పుడు ఉన్న అధికారులు ఇప్పుడు ఉన్నారు. అయినా శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తోందో ఆలోచించాలి. గత ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో చేసిందన్నారు. పార్టీ నాయకులను సృష్టిస్తుంది కానీ నాయకులు పార్టీని సృష్టించరు అని అన్నారు. మంచి యువ నాయకత్వాన్ని తయారు చేస్తున్నామని కేసీఆర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement