Monday, November 18, 2024

TS | బోర్లు వేసి అప్పులపాలు.. రైతు ఇంట పెళ్లికి కేసీఆర్ ఆర్థిక సాయం

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. పర్యటనలో భాగంగా ముందుగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం ధరావత్ తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు.

ఈ క్రమంలో అంగోతు సత్తెమ్మ అనే మహిళా రైతు తన బాధను కేసీఆర్‌కు చెప్పుకున్నారు. నీరు లేక పంట ఎండిపోతుండడంతో నాలుగు బోర్లు వేశామని.. అయినా.. చుక్క నీరు ప‌డ‌క‌పోవ‌డంతో నాలుగు ఎకరాల పంట ఎండిపోయిందని వాపోయింది. బోర్లు వేసేందుకు దాదాపు రూ.5 లక్షల వరకు అప్పు అయ్యిందని కన్నీరు పెట్టుకుంది.

తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని, పంటలు ఎండిపోయి, అప్పులు చేసి బోర్లు వేయ‌డంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సత్తెమ్మ కేసీఆర్ కు తెలిపారు. కేసీఆర్ వెంటనే స్పందించి సత్తెమ్మ కొడుకు పెళ్లి ఖర్చు నిమిత్తం రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. రైతులెవరూ బాధపడకూడదని కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పొరాడి మన నీళ్లు మనం తెచ్చుకుందామని నష్టపోయిన రైతులకు కేసీఆర్ భరోసా కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement