Friday, November 22, 2024

దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలక పాత్ర పోషిస్తారు.. ఆశీర్వదించాలని శ్రీ‌వారిని మొక్కుకున్నా: వినోద్‌కుమార్‌

దేశ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పాత్ర పోషించే విధంగా ఆశీర్వదించాలని వేంటేశ్వరస్వామి వారిని ప్రార్ధించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రనాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం తిరుమలలో శ్రీ‌వారి నైవేద్య విరామ సమయంలో త‌న కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన బోయినపల్లి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారని, ప్రభంజనం సృష్టించడం ఖాయం అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయిన తరువాత అనేక పథకాలు ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని అన్నారు.

దేశ రాజకీయాల్లో‌ కేసీఆర్ మంచి పాత్ర ఉండాలని స్వామి వారిని‌ ప్రార్ధించినట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. చాలా కాలం తరువాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, కోవిడ్ కారణంగా రెండేళ్ళుగా స్వామి వారిని దర్శించుకోలేక పోయామని చెప్పారు. ప్రపంచంలో చాలా దేశాలను సందర్శించానని, అయితే శుభ్రత కలిగిన దేవస్ధానంగా టిటిడి గొప్పగా ఉందని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే సందర్భంలో గానీ, ఉద్యమం సందర్భంలో గానీ కేసీఆర్ స్వామి వారి ఆశీస్సులు పొంది కానుకలు కూడా సమర్పించారని వినోద్ కుమార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement