హైదరాబాద్‌లోని నాంపల్లి చాపల్ రోడ్డులో పాత ప్రెస్ అకాడమీ స్థానంలో నిర్మించిన మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. మంగళవారం భవన నిర్మాణ పనులను పర్యవేక్షించిన సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్, అశోక్ రెడ్డి ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. త్వరలో మీడియా అకాడమీ భవనం ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించుకుంటామని తెలిపారు. వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో 29548 చదరపు అడుగుల్లో కార్పొరేట్ భవనంలా నిర్మించారన్నారు. భవనం ప్రారంభోత్సవానికి విచ్చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ పాత అకాడమీ భవనంలో ఫిబ్రవరి 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో కొత్త భవనం నిర్మించాలని సూచించారని గుర్తు చేశారు. ఈ క్రమంలో 2017లో భవన నిర్మాణానికి 15 కోట్లు విడుదల చేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్ కర్త, కర్మ, క్రియగా ఈ భవనం రూపుదిద్దుకుందన్నారు. భవనంలో జర్నలిస్టుల కోసం నాలుగు తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక అంతస్తు. రెండంతస్తుల్లో కలిపి 250 మంది కూర్చునే సామర్థం గల ఆడిటోరియం, గ్రంథాలయం, చైర్మన్, తదితరులకు ప్రత్యేక గదులు నిర్మించారని వివరించారు. తరగతి గదుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ల ప్రత్యేక గదిని కూడా నిర్మించారన్నారు. భవనం పనులన్నీ తుదిదశ కు వచ్చినందున, మిగిలిన అరకొర పనులు పూర్తిచేసి మెరుగులు దిద్దాలని ఆర్ అండ్ బి అధికారులను కోరారు. కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వల్ల, జర్నలిస్టుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి వల్ల ఇది సాధ్యమైందన్నారు