Tuesday, November 26, 2024

మేం తలుచుకుంటే దుమ్ము దుమ్ము అయిపోతారు – కాంగ్రెస్, బిజెపిల‌కు కెసిఆర్ స్ట్రాంగ్ వార్నింగ్..

హాలియా: కాంగ్రెస్‌ పార్టీది దోపిడీ రాజ్యం..దొంగల రాజ్యం. హైదరాబాద్‌ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసింది ఎవరు? గులాబీ జెండా ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ప్రాజెక్టులన్నీ ఆంధ్రాకు అనుకూలంగా కడుతుంటే నోరు మూసుకొని కూర్చున్నదెవరు? అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతిరహిత పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తూ, తెలంగాణలో గత దుస్థితికి ఎవరు కారణం? గతంలో రైతుల ఆత్మహత్యలకు కారకులు ఎవరు? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ పేరు ఉచ్ఛరించే అర్హత కూడా లేదని మండిపడ్డారు. పదవుల కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టుపెట్టారని, ఇప్పుడు పొలం బాట, పోరు బాట అని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఇతర సభల వద్ద వీరంగం సృష్టించడం మంచిదికాదు. కొత్త బిక్షగాడు పొద్దు ఎరగడు అన్నట్లు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఎవరో నామినేట్‌ చేస్తే వచ్చిన ప్రభుత్వం కాదు మాది. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. మేం తలుచుకుంటే మీరు దుమ్ము దుమ్ము అయిపోతారు. ఇక్కడ ఎవరూ చేతులు ముడుచుకుని కూర్చోలేదు. బీజేపీ నాయకత్వం ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సీఎం హెచ్చరించారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారబోతోంది. కాంగ్రెస్‌ నేతలు రైతు బంధులు కాదు.. రాబంధులు. రాక్షసులతోనే కొట్లాడాం..మీరో లెక్కా. కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను అన్నా కాంగ్రెస్‌ నేతలు ఎదురుతిరగలేదు. నల్లగొండకు ప్రాజెక్టులు మంజూరు చేస్తే కమీషన్ల కోసం చేశామని అంటున్నారు. మంచి పనులు చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ భూతం ఒక జనరేషన్‌నే నాశనం చేసింది. ఒక్కరైనా పోరాటం చేశారా? ఫ్లోరైడ్‌ భూతాన్ని వందశాతం తరిమేశాం. గతంలో అన్యాయాన్ని ప్రశ్నించని వాళ్లు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని సీఎం పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో పొలాలను ఎండబెట్టినా ఎవరూ మాట్లడలేదు. నాడు కరెంట్‌ లేదు, ఎరువుల్లేవు, రైతులు ఆత్మహత్య చేసుకుంటే అడిగే దిక్కులేదు. కాంగ్రెస్‌ నేతలకు ఇవ్వడం చాతకాలేదు. మేం ఇస్తుంటే విమర్శలు చేస్తున్నారు. దేశంలో అత్యధిక వడ్లు ఎఫ్‌సీఐకి ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. ముత్యాల బ్రాంచ్‌ కెనాల్‌ 50 ఏండ్లలో ఎందుకు లైనింగ్‌ చేయలేదు. ఈ మొఖాలన్నీ నాడు ఏం చేశాయి. టీఆర్‌ఎస్‌ చేసిన ఒక్కో కార్యక్రమం భారతదేశంలో ఎక్కడైనా ఉందా? కళ్యాణలక్ష్మి దేశంలో ఎక్కడైనా అమలవుతుందా? గతంలో రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ ఆఫీసుల్లోకి వెళ్తే లంచాలివ్వాలి. ఇప్పుడు ధరణిని తీసుకొచ్చి అవినీతిని అరికట్టామని సీఎం వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement