Tuesday, November 26, 2024

మౌన‌మూ ఎత్తుగ‌డే….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: పాత తరం, మధ్య తరం, కొత్త తరం.. రాజకీ యాల్లో తలపండిన వ్యక్తిగా, సమకాలీన దేశ రాజకీయాలపై సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయాలు విపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సందర్భానుకూలంగా తన రాజకీయ వ్యూహాలను మారుస్తూ అంతుచిక్కని ఎత్తుగడలతో పరుగులు పెట్టిస్తున్నారు. ఏ కోణంలో గురిచూసి కొడతాడో తెలియక ప్రతిపక్ష కాంగ్రెస్‌, భాజపా కీలక నేతలు ఆందోళన చెందు తున్నారు. అసెంబ్లిd బడ్జెట్‌ సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి ఎన్నికలపైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. నిత్యం ఏదో ఒక సంచలనంతో ముందుకుపోయే కేసీఆర్‌.. గత వారం, పది రోజులుగా మౌనంగా ఉండడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతు న్నాయి. ఈ మౌనం వెనుక అంతర్గత వ్యూహం ఉండే ఉంటుందని, అది తమపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆ రెండు పార్టీల్లోని కీలక నేతలంతా గుసగుస లాడుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా కేసీఆర్‌ను గద్దె దించాలన్న పట్టుదలతో పనిచేస్తున్న కాంగ్రెస్‌, రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భాజపాలు గత కొద్ది రోజులుగా ఈ అంశంపై మేథోమధనం నిర్వహిస్తున్నాయి. గత ఎన్నికల తరహాలోనే కేసీఆర్‌ ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, మార్చి లేదా ఏప్రిల్‌లో అసెంబ్లిdని రద్దు చేస్తారని పుకార్లు జోరందుకోవడంతో, ఆ రెండు ప్రతిపక్ష పార్టీల అధినేతలు తీరిక లేకుండా కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. అదే సమయంలో ముందస్తుపై బీఆర్‌ఎస్‌ వెనుకడుగు వేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అలాంటిదేమీ లేదన్న కోణంలో ‘కేసీఆర్‌ మౌనం’ సంకేతాలిస్తుండడంతో ఆయన రాజకీయ వ్యూహమేంటో తెలియక ప్రతిపక్ష నేతలు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ తగ్గించే చర్యల్లో భాగమే ఇదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. విపక్షాలను కదిలించి.. వ్యూహం మార్చారని, ఇక ఐదేళ్ళు పూర్తిచేసుకున్న తర్వాతే కేసీఆర్‌ ఎన్నికలకు వెళ్తారని అంచనా వేస్తున్నారు. నిజానికి ఏ ఎన్నికల ముందైనా కేసీఆర్‌ వ్యూహం అలాగే ఉంటుందని గత అనుభవాలు స్పష్టం చేస్తునాయి. మూడోసారి అధికారమే లక్ష్యంగా పక్కా స్కెచ్‌తో బీఆర్‌ఎస్‌ మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమవుతోంది.


రూటు మార్చిన గులాబీ బాస్‌
కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపి రాష్ట్రంలో అలజడి సృష్టించే ప్రయత్నాలను తిప్పి కొట్టేందుకు గులాబీ బాస్‌ అన్ని కోణాల్లో సంసిద్ధమై ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ వ్యూహం లీకవడంతో రూటు- మార్చినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పొలిటికల్‌ హీట్‌ పెంచేలా ఫిబ్రవరి నెలలో పలు కార్యక్రమాలను రూపొందించుకున్న ఆయన తాజా రాజకీయాల నేపథ్యంలో వ్యూహాలను కొద్దిగా వాయిదా వేసుకున్నారు. ఈనెల 5వ తేదీన నాందేడ్‌లో బహిరంగ సభను నిర్వహించిన కేసీఆర్‌.. 17న కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించాలనుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే అమరవీరు స్మారక కేంద్రాన్ని కూడా ప్రారంభించి, ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేసి శాసనసభ ఎన్నికల దిశగా అడుగులను వేగవంతం చేస్తారని అందరూ భావించారు. ముందస్తు వ్యూహానికి అనుగుణంగానే అతి తక్కువ రోజుల అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్‌ను ఈనెల 12తోనే ముగించినట్లు ఆ రెండు రాజకీయ పార్టీలు అనుకున్నాయి. తన పుట్టిన రోజునాడు కొత్త సెక్రెటేరియట్‌ బిల్డింగును ప్రారంభించేందుకు, అదే రోజు జాతీయ నేతలతో ఒక భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు- చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.


కర్ణాటక ఎన్నికల తర్వాతే నిర్ణయం..
కొన్ని రోజుల క్రితం -పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఓ ఆసక్తికరమైన కామెంట్‌ చేశారు. ఫిబ్రవరి నెలాఖరులోనే అసెంబ్లీ రద్దవుతుందని, ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తుందన్నది ఆయన మాటల సారంశం. ఆయన యాదృచ్ఛికంగా అన్నారో.. లేక పక్కా సమాచారంతోనే అన్నారో.. తెలియదు కానీ, ఆ కామెంట్లే ఇప్పుడు గులాబీ బాస్‌ వ్యూహాన్ని మార్చేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ముందస్తుకు వెళ్ళే యోచనను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటన దాకా వాయిదా వేసినట్లు- తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీకి ఏప్రిల్‌ చివరిలోగానీ, మే నెల మొదటివారంలో గానీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీతోపాటు- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ అధినాయకత్వం అటు-, ఇటు- ఫోకస్‌ చేయలేక ఇబ్బంది పడుతుందని, అది బీఆర్‌ఎస్‌కు కలిసివస్తుందని కేసీఆర్‌ ముందుగా భావించారు. కానీ, తెలంగాణ అసెంబ్లీని ముందస్తు ఎన్నికల కోసం రద్దు చేస్తే.. ఆ వెంటనే రాష్ట్రపతి పాలన విధించే వ్యూహంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలున్నట్లు- సమాచారం అందడంతో అసెంబ్లీ రద్దును కొన్ని నెలలపాటు- వాయిదా వేసినట్లు- తాజాగా గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి చెక్‌
నిజానికి అసెంబ్లీ రద్దు అయితే.. ఆరు నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటు-ంది. ప్రస్తుతం మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వుంటు-ంది. ఈ క్రమంలో తాము తెలంగాణ ఎన్నికలకు సిద్ధంగా లేమని గనక కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తే.. అది రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు వేయిస్తుంది. ఇటీ-వల కేంద్ర ప్రభుత్వ కనుసన్నట్లో ఎన్నికల కమిషన్‌ వ్యవహరించడం పరిపాటిగా మారింది. మొన్నటికి మొన్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటన సమయంలో ఈ అంశం తేటతెల్లమైంది. తాజాగా తెలంగాణ విషయంలో సీఈసీ.. కేంద్రం కనుసన్నల్లో వ్యవహరించదన్న గ్యారెంటీ- ఏమీ లేదు. ముందస్తు నేపథ్యంలోనే వనరులను సమకూర్చుకున్నట్లు స్వయంగా తెలంగాణ సీఈవో ప్రకటించారు కూడా. దీంతో ముందస్తు వ్యూహంతో అసెంబ్లీని రద్దు చేస్తే అది తమకు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయని భావించడం వల్లనే కేసీఆర్‌ వ్యూహం మార్చుకున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును ప్రకటించిన తర్వాతనే అంటే మార్చి చివరి వారం లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ రద్దు నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాయిదా పడిన సచివాలయ భవన ప్రారంభోత్సం కూడా మార్చిలోనే జరిగే అవకాశాలున్నాయి. అదె సమయంలో అమరవీరుల స్మారక స్థూపం, అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమాలను కూడా మార్చి లేదా ఏప్రిల్‌ నెలల్లో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆరు నెలల వ్యవధి అంటే జులై, ఆగస్టు మాసాల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్‌ ప్రణాళికలు అనూహ్యం
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా వద్దా అనేది సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేస్తే రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటు-ంది. ఒక వేళ రద్దు చేయకపోయినా నవంబర్‌, డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. అయితే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడానికి మరోసారి ముందే ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు- ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే కేసీఆర్‌ అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేసుకుని సిద్ధమై ఉంటారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ముందు కేసీఆర్‌ అభ్యర్థులపై కూడా కసరత్తు పూర్తి చేసుకుని వ్యూహం ప్రకారం రంగంలోకి దిగి ఎక్కడా వెనుతిరిగి చూడకుండా రెండోసారి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సారి కూడా ముందస్తుకు వెళ్లాలనుకుంటే.. అంతకంటే మించిన భారీ ప్రణాళిక ప్రకారం ముందుస్తుకు వెళ్తారు. అందులో ఎలాంటి ధర్మ సందేహాలు ఉండవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా విపక్షాలు పూర్తిగా బలం కూడగట్టు-కోకముందే, ఎన్నికల సమరానికి శంఖారావం పూరించాలన్నది కేసీఆర్‌ వ్యూహమని అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement