Friday, November 22, 2024

సాగ‌ర శంఖారావం..

హైదరాబాద్‌, : నాగార్జునసాగర్‌ నియోజకవర్గం హాలియా కేంద్రంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల సమరశంఖారావం పూరించబోతున్నారు. ఓ వైపు పట్టభద్ర ఎన్నికలు, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక, మరోవైపు ఒకేసారి రూ.3 వేల కోట్ల విలువైన ఎత్తిపోతల పథకాలు మంజూరుచేసి దశాబ్దాల సమస్యలు సీఎం కేసీఆర్‌ నెరవేర్చిన నేపథ్యంలో సీఎంకు మంత్రి జగదీష్‌ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల గొండ జిల్లా ప్రజల ధన్యవాదసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరవుతున్న సీఎం కేసీఆర్‌ నల్లగొండ అభివృద్ధిపై మరిన్ని వరాలు కురిపించే అవకాశం ఉంది. ప్రధానంగా నాగార్జున సాగర్‌ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకోగా సీఎం ఏం మాట్లాడుతా రన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. సీఎం కేసీఆర్‌ పాల్గొనే సభను ఉమ్మడి నల్లగొండ జిల్లా శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, కనీసం 2లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా..
గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా, నాగార్జునసాగర్‌ నియోజక వర్గంలో బంపర్‌ విక్టరీ సాధించేలా.. సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే.. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సొంత నియోజక వర్గం హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నిక జరగ్గా టీఆర్‌ఎస్‌ బంపర్‌ విక్టరీ సాధించింది. నోముల నర్సింహ్మయ్య మృతితో.. నాగా ర్జున సాగర్‌ అసెంబ్లిd స్థానం ఖాళీకాగా, త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఇది టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీటు కావడం, సీఎం స్వయంగా నాగార్జునసాగర్‌ నియోజక వర్గానికి వస్తుండడం తో హుజూర్‌నగర్‌ మెజారిటీని బద్దలు కొడతామని టీఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నాయి. ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వంపై తీవ్ర పోటీ ఉండగా, అభ్యర్థిపై కూడా బుధవారం సభలో స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. నోముల తనయుడు భగత్‌, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, బాలరాజుయాదవ్‌తో పాటు పలువురు నేతలు టికెట్‌ ఆశిస్తున్నా.. సీఎం ఇప్పటికే అభ్యర్థిత్వాలపై సర్వే నిర్వహించి అభిప్రాయానికి వచ్చారు.
ప్రగతి మంత్రం
నల్లగొండలో ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమే సంకల్పంతో డిండి ప్రాజెక్టును రూపకల్పన చేయగా, వివిధకారణాల రీత్యా అది ముందుకు కదలలేదు. ఇటీవల సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌ ఈ ఏడాది డిండి ప్రాజెక్టు పూర్తిచేయాలని అధికార యంత్రాంగానికి డెడ్‌లైన్‌ విధించారు. డిండి, ఎస్‌ఎల్‌బీసీ, యాదాద్రి ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రం లాంటి మెగా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా, యాదాద్రి నృసింహస్వామి ఆలయం రాష్ట్రానికి మకుటాయమానంగా నిర్మితమవుతోంది. ఒక్క నల్లగొండ జిల్లాలోనే.. ప్రస్తుతం రూ.35 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అభివృద్ధిని ఆవిష్కరిం చడంతో పాటు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించమని విజ్ఞప్తి చేయనున్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక తర్వాత కృతజ్ఞత సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఏడాది తర్వాత ఇపుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బహిరంగసభ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement