కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జంట జలాశయాల పరిరక్షణకు తొలుత జీవో 50 తీసుకొచ్చారు. ఇందులో ఆయా పరివాహక 300 గ్రామాలు చేర్చారు. దీంతో అప్పట్లో తీవ్ర ఆందోళనలు చెలరేగడంతో పున:సమీక్షించిన ప్రభుత్వం 1989లో 184 జీవోను తెచ్చింది. పాత జీవోను సడలించి కొన్ని మార్పులు తీసుకొచ్చింది. అయినప్పటికీ ప్రజల్లో ఆందోళన తగ్గలేదు. ఈ నేపథ్యంలో 1994లో ప్రజల ఉద్యమాలకు తలొగ్గిన సర్కార్ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. అప్పటి సీఎం కోట్ల వియభాస్కర్ రెడ్డి ఈ కమిటీ 1996లో ఇచ్చిన మధ్యంతర నివేదిక ఆధారంగా చెరువు కింది భాగం 1కిలో మీటర్ పరిధి మినహాయించి మిగతా భాగం వరకు ఎలాంటి ఇబ్బందులు లేవని, పై భాగంలో 10 కిలోమీటర్లు ఉండాలనే సిఫార్సులతో నూతనంగా 111 జీవోను తెచ్చారు. ఇందులో 300 గ్రామాలను 84కు కుదించారు. ఇప్పుడీ అంశంలో కూడా 10 కిలోమీటర్ల సాంకేతిక సరిగా లేదని ప్రజలు వాపోతున్నారు. స్థానిక సంస్థలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి సర్కార్‌కు పంపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ కూడా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు నిర్ణయం ఉంటుందని అక్కడి ప్రజలు భావిస్తుండగా, ప్రభుత్వం కూడా అదే కోవలో కమిటీ ఏర్పాటుకు కృషి చేస్తోంది. దీంతో ప్రజల సుధీర్ఘ ఆకాంక్ష సాకారమయ్యే పరిస్థితి అతి త్వరలో ఉందని స్పష్టమవుతోంది.
హైదరాబాద్, : హైదరాబాద్ శివార్లలోని అత్యంత విలువైన ప్రాంతాల అభివృద్ధికి ఆటంకంగా మారిన గత ఉత్తర్వులపై ప్రభుత్వం శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తోంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల అడ్డగోలు ఆక్రమణలు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇతర అంశాలపైనా దృస్టిసారించింది. హైదరాబాద్ నగర అభివృద్ధి,వేగంగా విస్తరించేం దుకు అడ్డుగా ఉన్నప్రతికూల అంశాలనూ అధ్యయనం చేస్తోంది. ఐటీ, ఇతర రంగాలు విస్తరించేందుకు అనువుగా ఉన్న ప్రాంతాల్లో అడ్డుగా ఉన్న నిబంధనలను సమీక్షిస్తోంది. నగరానికి తాగునీరందించే జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల పరిరక్షణ కోసం గతంలో ఉమ్మడి ఏపీలో జారీ చేసిన జీవో 111పై ప్రభుత్వం ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు ఈ జీవో తొలగింపునకు ఉన్న అడ్డంకులపై అధ్యయనం చేసేందుకు, హరిత ధర్మాసనంలో పిటీషన్ వేసేందుకు ప్రత్యేక కమిటీని నియమించాలని చూస్తోంది. జలాశయాలకు 10కిలోమీటర్ల పరిధిలోని 7 మండలాలకు చెందిన 84 గ్రామాల్లో 90శాతం భూమిని వ్యవసాయ అవసరాలకే వినియోగించాలని, పారిశ్రామిక అవసరాలకు ఎటువంటి అవకాశంలేకుండా కేవలం 10శాతం భూమినే నిర్మాణాలకు అనుమతించేలా అప్పట్లో ఈ జీవోను జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, కొత్తూరు, రాజేంద్రనగర్, చేవెళ్ల, శంకర్ పల్లి మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో ఈ జీవో అమలులో ఉంది.
1996లో అమలులోకి తీసుకొచ్చిన ఈ జీవోద్వారా ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్‌టీఎల్)పరిధిలోనుంచి 10 కిలోమీటర్లలోపు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. ఒక స్థలంలో 10శాతంమేర కేవలం నివాసాలకు మాత్రమే జీ ప్లస్2 నిర్మాణాలు చేసుకునే వెసులుబాటు ఉంది. కాగా 2007-08నుంచి అన్ని రాజకీయ పార్టీలు జీవో 111ను ఎత్తివేస్తామని ఇస్తున్న హామీలతో పేదలు, మధ్యతరగతి ప్రజలు భారీగా ప్లాట్లను కొనుగోలు చేశారు. నిబంధనలకు విరుద్దంగా భారీ సంఖ్యలో వెంచర్లు వెలవడంతో అధికార యంత్రాంగాలు చూసీచూ డనట్లుగా ఉదాసీనంగా వ్యవహరించాయి. దీంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు జోక్యంతో కదిలిన ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు ఉత్తర్వులను జారీ చేసి ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హెచ్‌ఎండీఏ ఈ బాధ్యతలను పంచాయతీలకు కట్టబెట్టింది. హెచ్‌ఎండీఏ నివేదిక ప్రకారం 12,500అక్రమ కట్టడాలు, 3వేల వరకు ఫాంహౌస్‌లు ఉండొచ్చని అంచనా. ఇక ఇంజనీరింగ్ కాలేజీలు 50వరకు ఉండగా, కాలనీల్లో వేల సంఖ్యలో ఇండ్ల నిర్మాణాలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పది అంతస్థులకుపైగా భారీ భవనాల వెలిశాయి. 47 గ్రామపంచాయతీల్లో 3030 లేఅవుట్లలో 2991 ఎకరాల్లో వెలిసిన వెంచర్లను ఇటీవలే అధికారులు కూల్చివేతలు చేశారు. దీంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పలు డిమాండ్ల నేపథ్యంలో అశాస్త్రీయమైన జీవోలోని అక్కర్లేని అంశాల్లో సవరణకు ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్‌కు తాగునీటిని అందించే జలాశయాలు కలుషితం కావొద్దనే లక్ష్యంతో ఉమ్మడి ఏపీలో తీసుకొచ్చిన జీవో 111 రద్దు దిశగా ప్రభుత్వం పరిశీలిస్తోంది. నగర ప్రజల దాహార్తిని తీర్చేలా కృష్ణా, గోదావరి జలాలను అందించడం, నగరం చుట్టూ నాలుగు జలాశయాలను నిర్మించే ప్రణాళిక పురోగతిలో ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటోంది. ప్రధానంగా 84 గ్రామాల అభివృద్ధి, పేదలు, మధ్యతరగతి ప్రజల క్షేమం ధ్యేయంగా ప్రభుత్వమీ నిర్ణయానికి వస్తోందని తెలుస్తున్నది.
కలుషితం కావొద్దనే…
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, కొత్తూరు, రాజేంద్రనగర్, చేవెళ్ల, శంకర్ పల్లి మండలాల పరిధిలోని 84 గ్రామాలనుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ కలుషితం కావొద్దనే ఉద్దేశంతో ఈ జీవో అమలులోకి తెచ్చారు. 1996లో అప్పటి సర్కార్ వరదనీరు సులువుగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేరాలనే లక్ష్యంతో జీవో 111ను తెచ్చింది. కాలుష్య కారక పరిశ్రమలకు తావులేకుండా, భారీ నివాస భవనాలకు అనుమతులు లేని విధంగా పెద్దపెద్ద హోటళ్లకు అవకాశం లేకుండా మార్గదర్శకాలతో ఈ జీవోలో ఆంక్షలు తీసుకొచ్చారు. 9 దశాబ్దాలుగా ఇక్కడి శిఖం భూములు కబ్జా అయినట్లుగా గుర్తించిన ప్రభుత్వం పనిలోపనిగా వాటి వివరాలనూ నిగ్గు తేల్చనున్నది. హిమాయత్‌సాగర్ పరిధిలో 50ఎకరాలు, ఉస్మాన్ సాగర్ పరిధిలో మరో 300 ఎకరాల శిఖం భూముల్లో అక్రమ కట్టడాలు వెలిసినట్లుగా గుర్తించి కేసులు నమోదు చేశారు.
జీవో 111 ప్రకారం భారీ భవన నిర్మాణాలపై నిషేదం అమలులో ఉంది. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో దాదాపుగా 12,500లకు పైగా అక్రమ భవనాలు యధేచ్చగా నిర్మించినట్లు లెక్కలున్నాయి. ఈ వ్యవహారంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేశారని కేసు ఉంది. వీటిపై విచారణ కొనసాగుతోంది. అయితే మరోవైపు సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలో భాగంగా జీవో 111ను ఎత్తివేస్తామని చెప్పారు. దీనిపై అధికారుల స్థాయిలో కసరత్తు మొదలైందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయా గ్రామాల పంచాయతీలు కూడా జీవో రద్దు కోరుతూ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నారు. ఈ జీవోను ఎత్తివేయడంద్వారా భూములకు మంచి ధర రావడంతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అక్కడి స్థానికులు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు.
ఈ జీవో ఎత్తివేతతో ఇప్పటివరకు ఆయా ప్రాంతాల్లో నగరీకరణకు, నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి. ఫలితంగా హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న కారణంగా ఇక్కడి ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలు విస్తృతం కానున్నాయి.