హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తే, అందుకు ప్రత్యామ్నాయ మార్గాలకు ఇప్పటి నుంచే సిద్ధం కావా లని సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇప్పు డున్న పరిస్థితుల్లో మండుటెండలతో రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని, వారిలో భరోసా నింపేందుకు నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికను తక్షణమే రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టాలని స్పష్టం చేశారు. అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకోకుండా నీటిని నింపాలని సీఎం తేల్చి చెప్పారు. సాగునీటి పారుదల, వ్యవసాయం, అనుబంధ రంగాల ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. వివిధ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ, ఆయకట్టు అవసరాలు, రైతుల సమస్యలు తదితర అంశాలపై సమీక్షించారు.
పాలమూరు-రంగారెడ్డి పనుల పురోగతిని కూడా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యవసాయ రంగానికి నష్టం కలగొద్దని అన్నారు. రుతుపవనాలు ఆలస్యమైనా.. ఆయకట్టు పండాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగాన్ని కడుపులో పెట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తుచేశారు. వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో పంట సాగుకు అంతరాయం లేకుండా సాగునీటి సరఫరా కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం ఎంత ఖర్చు అయినా పర్వాలేదని, పంటలు కాపాడాల్సిందేనని అధికారులకు ఆదేశించారు.
రిజర్వాయర్ల నిరంతర పర్యవేక్షణ
జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలను, మిషన్ భగీరథ అవసరాలను సంబంధిత అధికారుల నుండి సీఎం ఆరా తీశారు. జూలై మొదటి వారంలో వర్షపాతం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తదితర అంశాలను సమీక్షించుకొని, పరిస్థితులకు అనుగుణంగా సముచిత నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. కాళేశ్వరం పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వ వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం రంగనాయక సాగర్ జలాశయంలో మూడు టిఎంసిలకు గాను 0.69 టిఎంసిల నీటి నిల్వ మాత్రమే ఉన్నాయని ఇంజనీర్లు తెలుపగా, రంగనాయక సాగర్ కు రెండు టిఎంసిల నీటిని మిడ్ మానేరు జలాశయం నుండి తక్షణమే ఎత్తిపోయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తద్వారా రంగనాయక సాగర్ జలాశయం కింద ఆయకట్టు-కు వానాకాలం పంటకు నీరందించడానికి వీలవుతుందని అన్నారు.
నిజాంసాగర్ ఆయకట్టుకు ఢోకాలేదు
ప్రస్తుతం నిజాంసాగర్ జలాశయంలో ఉన్న 4.95 టీఎంసీల నీటి నిల్వలు ఆగస్టు చివరి వరకు 3 తడులకు సరిపోతాయని, ఆ తర్వాత మరో మూడు తడులకు 5 టీఎంసీలు అవసరమని ఇంజనీర్లు సూచించారు. దీని కోసం ఆగస్టులో 5 టీఎంసీలను కొండపోచమ్మ సాగర్ ద్వారా నిజాం సాగర్‌కు తరలించాలని సమావేశం నిర్ణయించింది. ఆగస్టు నెలలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలను సమీక్షించుకొని, కొరత ఏర్పడిన పక్షంలో శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ద్వారా 30 నుంచి 35 టీఎంసీల నీళ్ళను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయాలని నిర్ణయించారు.
మల్లన్నసాగర్‌లో 10 టీఎంసీలు నింపండి
ఈ ఏడాది మల్లన్నసాగర్‌లో మరో 10 టీఎంసీలు నింపాలని సీఎం కేసీఆర్ అధికారులనుచ ఆదేశించారు. వానాకాలం ముగిసి జలాశయాల్లోకి ఇన్ ప్లnో ఆగిపోయిన తర్వాత అక్టోబర్, నవంబర్ నెలల్లో కాళేశ్వరం వద్ద గణనీయంగా గోదావరి నదుల్లో ప్రవాహాలుంటాయన్నారు. రెండో పంట అవసరాల కోసం ఆ నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల్లో తగినంత స్థాయిలో నింపి పెట్టు-కోవాలని సమావేశంలో నిర్ణయించారు. దీని కోసం ఎన్ని పంపులు, ఏ సమయంలో ఆన్ చేయాలనే విషయంపై ఒక ఆపరేషన్ మాన్యువల్ తయారు చేయాలని సాగునీటి అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సంవత్సరం ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి సాగునీటి శాఖ సన్నద్ధంగా వుండాలని ముఖ్యమంత్రి సూచించారు.
నిరంతరాయంగా తాగునీటి కోసం ముందస్తు చర్యలు
వాతావరణ శాఖ అంచనాల మేరకు జులై మొదటి వారం దాకా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. ఈ వర్షాభావ పరిస్థితుల రోజుల్లో సాగునీటి కోసం నీటిని విడుదలకు కొద్ది రోజుల పాటు- విరామం ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై సమీక్ష
పాలమూరు- రంగారెడ్డి పనులను సీఎం కేసీఆర్ సమీక్షించారు. సుప్రీంకోర్టు తీర్పుకి లోబడి ఆగస్టు చివరి నాటికి తాగునీటి కోసం నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలలోకి నీటిని ఎత్తిపోయాలని, అందుకు అవసరమైన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్ల నుండి పనులను తొలగించి వాటిని సమర్థులైన కాంట్రాక్టర్లకు అప్పగించాలని సూచించారు. అదే విధంగా తాగునీటి అవసరాలకు నీటిని మిడ్ మానేరు నుండి గౌరవెల్లి జలాశయంలో కూడా ఎత్తిపోయాలని సీఎం సూచించారు. గౌరవెల్లి ఆయకట్టు-కు సాగునీటి సరఫరా కోసం కాల్వల నిర్మాణాని-కై- చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వార్ధా బ్యారేజీకి రూ.4252.53 కోట్లతో ప్రతిపాదన
వార్ధా బ్యారేజీ ప్రాజెక్టు పరిపాలన అనుమతి కోసం రూ.4252.53 కోట్లకు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించామని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. కేంద్ర జలసంఘంలో వార్ధా బ్యారేజి ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలన ప్రారంభమైనందున త్వరలో ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి మంజూరు చేయాలని ఈఎన్సీ కోరారు. ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం సెక్రటరీలు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీలు శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీలు మురళీధర్, ఎన్. వెంకటేశ్వర్లు, శంకర్, చీఫ్ ఇంజనీర్లు హమీద్‌ఖాన్, రమణారెడ్డి, శ్రీనివాస్, అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.