హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ కరోనాను కట్టడి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. దేశంలో మరెక్కడాలేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్పలితాలిస్తున్నదన్నారు. దాన్ని కొనసాగిస్తూనే ప్రాధమిక వైద్య కేంద్రాలకు కరోనా పరీక్షల కోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలన్నారు. కరోనా పరీక్షలకు సంబంధించి రాపిడ్ యాంటీ జెన్ టెస్టు కిట్ల సంఖ్యను తక్షణమే పెంచాలన్నారు. అవసరమున్న మేరకు ఉత్పత్తిదారులతో మాట్లాడి సరఫరాను పెంచాలని సూచించారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో చికిత్స కోసం రాష్ట్రంలో ప్రత్యేక బెడ్ల ఏర్పాటు, మందులను తక్షణమే సమకూర్చుకోవాలని సీఎం సూచించారు కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, వాక్సిన్, లాక్ డౌన్ అమలు పై సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం సెక్రటరీ, సీఎంవో కొవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు కమిషనర్లు అంజనికుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, అడిషినల్ డీజీ జితేందర్, వైద్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వి, హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, డీఎంఈ రమేష్ రెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, కరోనా టాస్క్‌ఫోర్స్ సభ్యులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, రోనాల్డ్‌రాస్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం.
.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుందన్నారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, వారి ఆరోగ్య రక్షణలో భాగంగా లాక్‌డౌన్ కఠినంగానే అమలువుతున్నదన్నారు. కరోనా పరీక్షలు పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో తక్షణమే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలని సీఎం ఆదేశించారు. అదే సమయంలో వైద్య కేంద్రాల్లో కావాల్సిన మేరకు సిబ్బందిని నియమించుకోవాలని కలెక్టర్లకు, వైద్యాధికారులకు ఇప్పటికే అధికారాలిచ్చిన నేపథ్యంలో రిక్రూట్ మెంట్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని ఎంతటి ఖర్చుకైనా వెనకాడవద్దని సీఎం మరోసారి స్పష్టం చేశారు.
అన్ని పడకలు ఆక్సిజన్ పడకలుగా మార్పు..
అన్ని పడకలను ఆక్సిజన్ పడకలుగా మార్చాలని, రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తిని 600 ఎంటీలకు పెంచే విధంగా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. అదే సందర్భంలో సెకండ్ డోస్ వేయించుకోవాల్సిన వారు అధిక సంఖ్యలో ఎదురు చూస్తున్నందున వారికి సరిపోను వాక్సిన్లను తక్షణమే సరఫరా చేయాల్సిందిగా సంబంధిత వాక్సిన్ ఉత్పత్తిదారులతో మాట్లాడాలని కరోనా టాక్స్ ఫోర్సు చైర్మన్ మంత్రి కేటీఆర్‌ను సీఎం ఆదేశించారు. థర్డ్ వేవ్ ఒకవేళ వస్తే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలన్నారు.ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు ఇంకా ఏ ఏ రాష్ట్రాలు కరోనా కట్టడి చేస్తున్నవి. అందుకు వారు అమలు పరుస్తున్న కార్యాచరణ ఏంటో తెలుసుకోవాల్సిందిగా వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ దాని శాతం 5 శాతానికి తగ్గించగలిగినప్పుడే మనం కరోనా మీద విజయం సాధించినవారమౌతాం. ఆ దిశగా వైద్యాధికారులు చర్యలను చేపట్టాలని సీఎం సూచించారు.
బ్లాక్ ఫంగస్ చికిత్స బెడ్ల పెంపుకు సీఎం ఆదేశం..
కరోనానంతర పరిణామాల మీద చర్చించిన సీఎం బ్లాక్ ఫంగస్ వ్యాధిని కట్టడి చేయడంలో తీసుకోవాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం గాంధీలో 150 బెడ్లు, ఈ.ఎన్.టి. ఆస్పత్రిలో 250 బెడ్లను, మొత్తం 400 బెడ్లను కేటాయించినట్లుగా వైద్యాధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం సరోజినీదేవి ఆస్పత్రిలో 200 బెడ్లు, గాంధీ ఆస్పత్రిలో 160 బెడ్లను బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్స కోసం తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. ఇంకా ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా వాటి సంఖ్యను 1500 కు పెంచాలన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందులను తక్షణమే ఆర్డరివ్వాలన్నారు. బ్లాక్ ఫంగస్ కట్టడి కోసం కావాల్సిన డాక్టర్లను యుద్దప్రాతిపదికన నియమించుకోవాలన్నారు.
మానవతా దృక్పథంతో స్పందించాలి..
కరోనా కంట్రోల్ చేయడానికి మించిన ప్రాధాన్యత ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని సీఎం అన్నారు. ఎన్ని కోట్లయినా ప్రభుత్వం ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే అప్పు తెచ్చయినా కరోనా కట్టడికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అటు కరోనా ఇటు బ్లాక్ ఫంగస్‌తో మొత్తం వ్యవస్థ దీనావస్థలో, భయానక పరిస్థితుల్లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ, యంత్రాంగంతో పాటు, ప్రైవేటు వైద్య రంగం, ఇతర రంగాలు కూడా మానవతా దృకృథంతో స్పందించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు