Friday, November 22, 2024

కేసీఆర్ దౌత్యం ఫలితం.. పెండింగ్ ప్రాజెక్టులకు లైన్ క్లియర్..

ప్ర‌భ‌న్యూస్: గోదావరి బేసిన్‌లోని పెండింగ్‌ ప్రాజెక్టులకు వేగంగా లైన్‌ క్లియర్‌ అవుతోంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంతో చేసిన దౌత్యం ఫలించింది. నాలుగైదు రోజుల్లో గోదావరి బేసిన్‌లోని పెండింగ్‌ ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఆమోదం పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జలశక్తి శాఖలోని అన్ని డైరెక్టరేట్లలో ఈ ఆరు పెండింగ్‌ ప్రాజెక్టుల డీపీ ఆర్‌ ఆమోద పనులు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. డీపీ ఆర్‌ల ఆమోదం కోసం ఫైళ్లు పుట్‌ అప్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లి లో డీపీఆర్‌ల స్క్రూట్నీ కొనసాగుతున్నట్లు సమాచారం. దీంతో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల డీపీఆర్‌లకు కొద్ది రోజుల్లోనే ఆమోదం లభించనుంది. గోదావరి బేసిన్‌లోని ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లు కేంద్ర జలశక్తిశాఖ ఆమోదం కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నాయి.

చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, చనఖాకొరటా, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టు, మోడికుంట వాగు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుల డీపీఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో కేంద్ర జలశక్తి శాఖ స్పందించి డీపీఆర్‌ల ఆమోదానికి వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ ప్రాజెక్టులు కొత్తవని ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టులను ప్రతిపాదించారని, నీటి కేటాయింపులు కూడా జరిపారని తెలంగాణ గుర్తుచేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2010లోనే ప్రతిపాదించిన బేసిన్‌లోని ప్రాజెక్టుల పనులనే తాము చేపడుతున్నామని, ఆ మేరకు రూపొందించిన డీపీఆర్‌లకు వెంటనే ఆమోదం తెలపాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు స్పష్టంచేస్తోంది.

ఈ ఆరు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర విభజన చట్టం -2014లోని సెక్షన్‌ 85(8)(డీ) పరిధిలోకి రావని తేల్చి చెప్పింది. గోదావరి బేసిన్‌లో తెలంగాణకు కేటాయించిన నీటి కేటాయింపుల పరిధికి లోబడే ఆరు ఎత్తిపోతల పథకాలు చేపట్టామని ఇటు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), అటు కేంద్ర జలశక్తిశాఖ, సీడబ్ల్యూసీ ముందు తెలంగాణ గట్టిగా వాదనలు వినిపించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement