పండరీపురం – మహారాష్ట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన నేటి ఉదయాన్నే సోలాపూర్ నుంచి పండరీపూర్ చేరుకున్నారు. పండరీపూర్‌లోని శ్రీవిట్టల్ రుక్మిణీ ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవిఠల్ రుక్మిణీ ఆలయ సందర్శన సందర్భంగా శ్రీవిఠలేశ్వర స్వామికి, రుక్మిణీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కుకున్నారు. దేశంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ప్రార్థించారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ మెడలో తులసి మాల వేసి వేదమంత్రాలతో ఆశీర్వాదం అందజేశారు.
అంతకుముందు కేసీఆర్ ఆలయానికి చేరుకోగానే ప్రధాన ద్వారం దగ్గర ఆయనకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కాషాయ వస్త్రం కప్పి సత్కరించారు. అనంతరం శ్రీవిఠలేశ్వర స్వామి, రుక్మిణీ అమ్మవార్లతో కూడిన ప్రతిమను, అదేవిధంగా రుక్మిణీ అమ్మవారి చిత్రపటాన్ని సీఎం కేసీఆర్‌కు బహూకరించారు.. సీఎం వెంట బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌రావు, డీ దామోదర్ రావు, పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
కాగా, ప్రత్యేక పూజల అనంతరం సమీప గ్రామంలో పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు. అక్కడ స్థానిక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు శక్తిపీఠం తుల్జాపూర్ భవానీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు.