Monday, November 25, 2024

TS : జ్యోతిబా పూలేకు కేసిఆర్ ఘ‌న నివాళి

మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని త్యాగాలను, సమసమాజ కార్యాచరణను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్మరించుకున్నారు. పదేండ్ల తమ పాలనలో సబ్బండ వర్గాల కోసం అమలుచేసిన కార్యక్రమాల వల్ల సామాజిక ప్రగతి కార్యాచరణకు దారితీసిందని గుర్తుచేసుకున్నారు.

ఒకనాడు అల్ప దృష్టితో, నిర్లక్ష్య ధోరణులతో వెనుకబడిన సమాజంగా తెలంగాణ మారిందని చెప్పారు. ఉద్యమ కాలం నుంచి రగిలిన సబ్బండ వర్గాల చైతన్యం రాష్ట్రం ప్రగతి పథంలో ముందడుగు వేసిందన్నారు. ఈ మొత్తం క్రమంలో మహాత్మా పూలే స్ఫూర్తి ఇమిడి ఉందన్నారు. తమ పదేండ్ల పాలన కాలంలో అమలైన పథకాల కార్యాచరణ బహుజన వర్గాల ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసిందని కేసీఆర్ తెలిపారు. అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపిందన్నారు. అదే స్ఫూర్తి, కార్యాచరణ కొనసాగాలని ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో బహుజనులు సమానత్వం సాధించేలా కృషి చేయడమే ఫూలేకు ఘన నివాళి అన్నారు.

- Advertisement -

సిద్దిపేట‌లో హరీశ్‌…

బడుగు, బలహీన వర్గాల బాగుకోసం మహాత్మా జ్యోతిబా ఫూలే చేపట్టిన కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. సామాజిక దార్శనికుడిగా, సంఘ సంస్కర్తగా, వర్ణవివక్షతపై పోరాడిన క్రాంతికారుడు పూలే అని చెప్పారు. ఆయన ఆశయాల సాధన, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్‌ పాలన కొనసాగిందన్నారు. పూలే 198వ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి హరీశ్‌ రావు పుష్పాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, ఫూలే, బాబు జగ్జీవన్‌రాం కలలుగన్న పాలనను తాము నిజం చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సామాజిక సమానత్వ దిశగా కృషి చేశామని తెలిపారు. వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి ఫూలే గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటుచేశామన్నారు. ఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద ఒక్కొక్కరికి రూ.20 లక్షలు ఆర్థికసాయం అందించామని చెప్పారు. బహుజనుల కోసం ఆత్మగౌరవ భవనాలు, బీసీల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశామని గుర్తుచేశారు. వృత్తుల వారీగా ప్రోత్సాహకాలు అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని వెల్లడించారు. బడుగు, బలహీనవర్గాల సమగ్రాభివృద్ధికి కృషి చేశామన్నారు.


కేటీఆర్ నివాళి..
కాలంతో సంబంధం లేకుండా చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పూలే అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కులవివక్ష, అసమానతలపై ఆనాడే ఫూలే పోరాడారని చెప్పారు. విద్యతోనే సమానత్వం వస్తుందని, సావిత్రిబాయితో కలిసి అందరికి విద్య అందించేందుకు కృషి చేశారని తెలిపారు. తెలంగాణలో భవన్‌లో మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మధసూదన్‌ చారి, కర్నెప్రభాకర్‌, పొన్నాల లక్ష్మయ్యతో కలిసి పూలేకు కేటీఆర్‌ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన నాయకుడు కేసీఆర్‌ అని చెప్పారు. వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటుచేసి నాణ్యమైన విద్య అందించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement