Wednesday, November 20, 2024

గాంధీ మార్గంలో ఉద్య‌మించ‌డం వ‌ల్లే తెలంగాణ‌ను సాధించ‌గ‌లిగాం – కెసిఆర్

హైదరాబాద్‌: గాంధీ మార్గంలో.. రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంద‌ని, అహింసా పోరాటంతోనే గమ్యాన్ని ముద్దాడ గలిగామ‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ అన్నారు..హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాచారశాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించిన గాంధీ సినిమాను 35లక్షల మంది విద్యార్థులు, ఇతరులు చూసి ప్రభావితమయ్యారని తెలిపారు. గాంధీ చిత్రాన్ని ఈ తరం వారికి పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. మహనీయుల త్యాగాలను స్మరించుకోవటం మనందరి బాధ్యత అన్న సీఎం కేసీఆర్ స్వాతంత్ర్య సమరయోధుల గొప్పతనం నేటి తరానికి సమగ్రంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. సకల జనులకు ప్రగతి ఫలాలను సమానంగా పంచడం ద్వారానే స్వాతంత్ర్యోద్యమ ఆశయాలను పరిపూర్తి చేసుకోగలుగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి అభిల‌షించారు……

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ,
”కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలిచింది. విభిన్న సంస్కృతుల ప్రజలను స్వాతంత్రోద్యమం ఏకతాటిపై నిలిపింది. నేటికీ యావత్‌ ప్రపంచాన్ని గాంధీ సిద్ధాంతం ప్రభావితం చేస్తోంది. గాంధీజీ చూపించిన అహింసా మార్గంలోనే స్వాతంత్ర్యోద్యమం విజయతీరం చేరింది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన మాత్రమే అనే అభిప్రాయం ఉండేది. టీఆర్‌ఎస్‌ ను స్థాపించినప్పుడు అహింసాయుత ఉద్యమం ద్వారా రాజ్యాంగ పరిధిలో ఉద్యమించి విజయం సాధిస్తామని నేను నిండు మనసుతో స్పష్టంగా ప్రకటించా. మొదట కొందరు నాతో ఏకీభవించలేదు. రాను.. రాను నేను ఎంచుకున్న మార్గమే సరైందని అంగీకరించి వెంట నడిచారు. ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా సరే లక్ష్యాన్ని సాధించాలి తప్ప అహింసా మార్గాన్ని వీడకూడదని నేను నిర్ణయించుకున్నా. ఆ నేపథ్యంలో నుంచి వచ్చిందే ఆమరణ నిరాహార దీక్ష ఆలోచన. స్వాతంత్య్ర పోరాట కాలంలో బ్రిటీష్‌ పాలనే బాగుందన్న ప్రబుద్ధుల వంటి వారు తెలంగాణ ఉద్యమ కాలంలోనూ ఉండే వారు. వారు తెలంగాణ వద్దు సమైక్య పాలనే ముద్దు అని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చాలా చేశారు. మన చిత్తశుద్ధి ముందు వారి ప్రయత్నాలు విఫలం కాక తప్పలేదు. విచిత్రం ఏంటంటే వాళ్లే ఇవాళ మనకు తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు చెప్పడానికి సిద్ధపడుతున్నారు. తెలంగాణ ఉద్యమం ఆదర్శవంతమైనట్టే.. తెలంగాణ పరి పాలన కూడా స్వాతంత్ర్య పోరాట ఆశయాలకు అనుగుణంగానే ఉంది. స్వతంత్ర భారతంలో ఏనాడూ లేని విధంగా వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించుకో గలిగాం. రైతు బంధు వంటి పథకాల ద్వారా రైతుల కళ్లల్లో వెలుగులు చూస్తున్నాం.
గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వయం పోషకత్వం దిశగా మనం ఎంతో దూరం ప్రయాణించగలిగాం. గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహం ఇవ్వగలిగాం. గ్రామాలు సుసంపన్నంగా మారుతున్నాయి. ప్రజలందరికీ తాగునీరు కూడా ఇంతకాలం ప్రభుత్వాలు ఇవ్వలేకపోయాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. సంక్షేమానికి అగ్ర తాంబూలం ఇవ్వడం లోనూ, రైతు కేంద్రంగా ప్రణాళికల రచన చేయడంలోనూ, గ్రామీణ ఆర్థిక వృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వెనుక గాంధీగారి ప్రభావమే ఉన్నది. భారత దేశం ఆత్మ గ్రామాల్లోనే ఉన్నదని గాంధీగారు పదే పదే చెప్పారు. ఆ మాటల ప్రేరణతోనే గ్రామీణ జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. తెలంగాణ మోడల్‌ ఈరోజు దేశానికి దిక్సూచిగా నిలిచింది. ఈ అభివృద్ధి నమూనా ఇదే విధంగా కొనసాగిస్తూ సకల జనులకు ప్రగతి ఫలాలను సమానంగా పంచడం ద్వారానే స్వాతంత్ర్యోద్యమ ఆశయాలను పరిపూర్తి చేసుకోగలుగుతాం. మనది న్యాయ పథం.. మనది ధర్మ పథం. సకల జనుల సంక్షేమమే మనకు సమ్మతం” అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

అంతకు ముందు హెచ్‌ఐసీసీ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు వీక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement