Tuesday, November 26, 2024

TS: తాంత్రిక పూజల్లో కేసీఆర్ సిద్ధహస్తుడు.. బండి సంజయ్

కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తాంత్రిక పూజల్లో సిద్ధహస్తుడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం వద్ద బండి సంజయ్ మొక్కలు నాటారు. అట్లాగే బీజేపీ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇతర పార్టీల నేతలనే కాకుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కావాలని కోరుకుంటూ కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నారని మండిపడ్డారు. గణేష్ మండపాలకు తాయిలాల పేరుతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.3కోట్లు ఇస్తూ యువతను బీఆర్ఎస్ వైపు ఆకర్షించేందుకు కుట్ర చేశారని దుయ్యబట్టారు. దళిత బంధు, బీసీ బంధు ఇస్తామంటూ బీజేపీ సహా ఇతర పార్టీల నేతలను కూడా బీఆర్ఎస్ లోకి వచ్చేలా ఆశ పెడుతున్నారన్నారు. కేసీఆర్ ఎన్ని వేషాలేసినా, ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.

గ్రూప్ 1 పరీక్షల రద్దుకు ముమ్మాటికీ కేసీఆర్ బాధ్యత వహించి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు నష్టపోయిన ప్రతి నిరుద్యోగికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని, అలాగే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో నిరుద్యోగికి రూ.లక్షా 60 వేల నిరుద్యోగి భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేసీఆర్ కు ఓట్లు అడిగే హక్కే లేదని, నిరుద్యోగులు క్షమించబోరన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి గెలవాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్ నుండి గెలిచే వాళ్లంతా కేసీఆర్ కు ఏటీఎం మిషన్ లాంటివాళ్లేనని, ఎప్పుడంటే అప్పుడు వాళ్లను బీఆర్ఎస్ లోకి తీసుకోవడం ఖాయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement