Tuesday, November 26, 2024

కేసీఆరే నా మార్గదర్శి, దిక్సూచి .. విప్ శంబీపూర్ రాజు

(ప్రభ న్యూస్, కుత్బుల్లాపూర్) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో తొలి నుండి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీని విశ్వసించి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెన్నుచూపక సిఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో ప్రయాణించి ఆయననే దిక్సూచిగా తలచి ఉద్యమ పార్టీలో తన రాజకీయ జీవితాన్ని సల్పారు. ఫలితంగా రాష్ట్రం ఏర్పడిన కొద్దికాలంలోనే సిఎం కేసీఆర్ నుండి పిలుపు వచ్చింది. ఆయన ఆశీర్వాదంతో శంబీపూర్ రాజును 2016లో ఎమ్మెల్సీగా నియమితులయ్యారు.

ఇటీవలే శాసన మండలి ప్రభుత్వ విప్ గా ఎన్నికయ్యారు. కొమురం భీం- అసిఫాబాద్ జిల్లాలో జరిగే దశాబ్ది ఉత్సవాల్లో జాతీయ జెండా ఆవిష్కరించే గొప్ప అవకాశం రావడంతో పాటు గౌరవ వందనం దక్కింది. దీనిపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు స్పందిస్తూ.. ఒక ఉద్యమ కారుడికి ఇంతకన్నా గొప్ప అవకాశం ఏం దొరుకుతుందని, ఇదంతా కేసిఆర్ ఆశీర్వాదంతోనేనని, ఆయన అడుగు జాడల్లో ప్రయాణించడం కారణంగానేనని భావోద్వేగానికి లోనయ్యారు. శుక్రవారం కొమురం భీం-అసిఫాబాద్ జిల్లా నుండి ఫోన్ లైన్ లో తన భావాలను ఆంధ్ర ప్రభతో పంచుకున్నారు.


కన్న కల సాకారం కాగా రెండు సార్లు తెలంగాణ కోసం సల్పిన ఉద్యమాలు తొలిదశ పోరాటంలో ఎందరో అసువులు బాసినా అందని ద్రాక్షవలె తెలంగాణ రాష్ట్ర సాకారం. 2001లో సిఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ఎజెండాగా అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్దమంటూ బరి గీసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారు. ఆయన పిలుపుతో ఎంతో మంది యువత తెలంగాణ కోసం సర్వం వదులుకుని ఉద్యమబాట పట్టారు.

- Advertisement -

అనంతరం దఫదఫాలుగా సాగిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చుకుని కేంద్రం దిగివచ్చి 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2న‌ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. అయితే ఈ సంకల్పంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కూడా ఉన్నారు. 2001 నుండి కేసీఆరే తన మార్గదర్శి అంటూ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కన్న కల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగా తనకు వచ్చిన పదవులు మాత్రం సిఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనేనని స్పష్టం చేశారు.


దశాబ్ది ఉత్సవాల్లో ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం :
రాష్ట్రం సాధించి 9 ఏండ్లు పూర్తయిన సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను కని, విని ఎరుగని రీతిలో నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా 33 జిల్లాలకు జూన్ 2న జరిగే ప్రారంభ ఉత్సవాలకు మంత్రులు, ప్రభుత్వ విప్ లను ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొమురం భీమ్- అసిఫాబాద్ జిల్లాకు మేడ్చల్ జిల్లా బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రభుత్వ విప్ శంబీపూర్ రాజును నియమించింది. దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఉద్యమకారుడు, ప్రభుత్వ విప్ శంబీపూర్ రాజు ఆ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు.


ఉద్యమ కారుడిగా నాకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ రాజు
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం త‌నకు అరుదైన గుర్తింపును ఇచ్చింది. కొమురం భీమ్- అసిఫాబాద్ జిల్లా ఉత్సవాల్లో పాల్గొనడం – ప్రభుత్వ యంత్రాంగంచే గౌరవ వందనం దక్కడం అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించడం త‌నకు గొప్ప అవకాశమే. ఇదంతా త‌నకు ఉద్యమ పార్టీ బీఆర్ ఎస్ ను నమ్ముకుని సిఎం కేసీఆర్ చూపిన మార్గదర్శకత్వంలో ప్రయాణించడం కారణంగానే దక్కింది.

సిఎం కేసీఆర్ వెన్నుచూపక చూపిన పోరాటం- పదవులను తృణ ప్రాయంగా త్యజించిన తీరుతో తెలంగాణ రాష్ట్ర సాకారం అయ్యింది. తాను తెలంగాణ వస్తే చాలు అని కల కన్నానని, కానీ రాష్ట్రం రావడంతో పాటు అభివృద్ధి-సంక్షేమం స్వరాష్ట్రంలో గొప్పగా పరుగులు పెడుతున్నాయి. ఇక త‌నలాంటి ఉద్యమ కారులకు అనూహ్య రీతిలో పదవులు దక్కాయి. త‌నకు లభించిన పదవులు కేవలం సీఎం కేసీఆర్, మంత్రి రామన్న, ఎమ్మెల్సీ, ఆత్మీయ సోదరి కవితల ఆశీర్వాదంతోనని గుండెల మీద చేయేసి చెప్పగలనన్నారు.


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు :
కొమురంభీమ్-ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ, జిల్లా ఉత్సవాల ఇంచార్జ్ శంభీపూర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ సాధన, సిఎం కేసీఆర్ టిఆర్ ఎస్ పార్టీ స్థాపన, ఉద్యమాలు పతాక స్థాయికి చేరి, కేసీఆర్ ఆత్మబలిదానానికి సిద్ధమవ్వడం, మిలియన్ మార్చ్- వంటా వార్పులు, రోడ్డు రోకో, రైలు రోకో లాంటి ఉద్యమాలతో కేంద్రం దిగి వచ్చి తెలంగాణ ప్రకటించిన తీరును వివరించారు.

అనంతరం సిఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిది సంవత్సరాల్లో అన్ని రంగాలను గణనీయంగా అభివృద్ధి పర్చడాని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, జిల్లా పరిషత్ ఛైర్ ప‌ర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్ బోరకడే హేమంత్ సహదేవ్, అదనపు కలెక్టర్ చాహత్ బా జ్పేయి, ఎస్పీ సురేష్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement