Saturday, November 23, 2024

ఇంటింటికి నాణ్య‌మైన తాగునీరు అందించిన ఘ‌న‌త కేసీఆర్ దే.. మంత్రి త‌ల‌సాని

తండాలు, గూడాలకు ఇంటింటికి నాణ్యమైన త్రాగునీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ లో మెట్రో వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మంచినీళ్ల పండుగ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ MD దాన కిషోర్, బెవరేజేస్ కార్పోరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, BRS పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్ లు దీపిక, కొలన్ లక్ష్మి, కుర్మ హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ, లాస్య నందిత, వాటర్ వర్క్స్ CGM ప్రభు, DGM శశాంక్, AE లు వెంకట్రావ్, సంధ్య , సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి త‌ల‌సాని మాట్లాడుతూ గతంలో గ్రామాలలో త్రాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడేవారని, పట్టణాలలో ట్యాంకర్ లు, వీధి నల్లాల వద్ద మహిళలు కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి ఉండేదని, ఖాళీ బిందెలతో రోడ్లపై ధర్నాలు చేయడం వంటివి నిత్య కృత్యంగా జరిగేవని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టి ఇంటింటికీ శుద్దిచేసిన త్రాగునీటి సరఫరా చేస్తున్న కారణంగా నీటికోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు పారిపోయాయని వివరించారు. హైదరాబాద్ మహానగరంలో 13,546 కోట్ల రూపాయలను ఖర్చు చేసి త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా నూతనంగా అదనపు పైప్ లైన్ లు, రిజర్వాయర్ ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలను తీసుకొచ్చి రోజురోజుకు విస్తరిస్తున్న నగర ప్రజలకు రానున్న 50 సంవత్సరాల పాటు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామ‌న్నారు. ముఖ్యమంత్రి ప్రజల అవసరాల గురించి ఎంతో దూరదృష్టితో ఆలోచిస్తారనేందుకు నిదర్శనం ఇదే అన్నారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుండి నిరంతరం నీటి సరఫరా జరిగే విధంగా సుంకిశాల ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నగరంలో 8.15 లక్షల నల్లా కనెక్షన్ లు ఉండగా, నేడు 13.17 లక్షల కు పెరిగాయని తెలిపారు. నెలకు ఉచితంగా 20 వేల లీటర్ల వరకు నీటి సరఫరా కార్యక్రమం క్రింద 62 శాతం మంది లబ్దిపొండుతున్నారని వివరించారు. ఇందుకోసం 815 కోట్ల రూపాయలను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ప్రస్తుతం కోతికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 7 మున్సిపల్ కార్పోరేషన్ లు, 18 మున్సిపాలిటీలు, 24 గ్రామ పంచాయితీల పరిధిలోని ప్రజలకు ప్రతిరోజు 602 మిలియన్ గ్యాలన్ల త్రాగునీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. మురుగునీటిని శుద్ధి చేసే అతిపెద్ద వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం సొంతం అని అన్నారు. 3800 కోట్ల రూపాయల వ్యయంతో మురుగునీటి శుద్ధి ప్లాంట్ లను ఏర్పాటు చేసుకుంటున్నామని వివరించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాలకు అండగా నిలవాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement