నాలుగు నెలల్లోనే.. కాంగ్రెస్‌పై వ్యతిరేకత మొదలైంది
మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇంటింటి ప్రచారం
సూర్యాపేట, ప్రభ న్యూస్ : తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు కేసీఆరే కొండత అండ అని, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ లోక్ సభ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మద్దతుగా పెన్ పహడ్ మండలంలోని దూపాడు గ్రామంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మాటిచ్చి ఇంతవరకూ అమలుచేయకపోవడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామంటూ ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో హస్తం పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీలో దొందు దొందే అన్నారు. ప్రజలు, రైతులను ఆశల పల్లకీలో మోసుకెళ్లేలా మాటలు చెబుతున్నారని, కానీ వాటిని అమలు చేయలేకపోయారన్నారు. ఎన్నికలు ఉన్న సమయంలోనే రైతుబంధు నాలుగెకరాల వరకు ఇచ్చేందుకు నాలుగు నెలలు పట్టిందని, ఎన్నికల తతంగం పూర్తయితే అదికూడా నిలిపివేస్తారని, ఈ విషయాన్ని రైతులు గుర్తించాలన్నారు. అన్ని వర్గాలకు కొండంత అండ కేసీఆరే అన్న జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ పాలనకు ప్రస్తుత ప్రభుత్వ పాలనను ప్రజలే భేరీజు వేసుకోవాలన్నారు.
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఏస్ అభ్యర్ధుల విజయం ఖాయం అన్నారు. మన, మన పిల్లల భవిష్యత్తు కోసం మే 13న కారు గుర్తుకు ఓటు వేసి కంచర్ల కృష్ణారెడ్డి, క్యామా మల్లేష్ ను భారీ మెజార్టీతొ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సమన్వయ కర్త ఇస్లావత్ రామచంద్ర నాయక్, పెన్ పహాడ్ మండల ఎంపీపీ నెమ్మాది బిక్షం, మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్, సింగిల్ విండో చైర్మన్ వెన్న సీతారామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావ్, గుగ్గిళ్ల సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.