Tuesday, November 26, 2024

కరవు రాష్ట్రమే ఇప్పుడు సిరుల నేలైంది … అందరికీ ఆదర్శమైంది – కెసిఅర్

హైదరాబాద్ – తెలంగాణ ప‌రిపాల‌న‌కు గుండెకాయ‌గా, అత్యంత శోభాయ‌మానంగా నిర్మించిన స‌చివాల‌యం తన చేతుల మీదుగా ప్రారంభించ‌డం తన జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.హైదరాబాద్‌లో నూతన నిర్మించిన సెక్రటేరియట్‌ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. .పెద్ద పోరాటం త‌ర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. స‌మైక్య పాల‌న‌లో తెలంగాణ‌లో చాలా విధ్వంసం జ‌రిగిందని, నీళ్లు రానే రావు.. సాధ్యమే కాదు.. తెలంగాణ వెనుక‌బ‌డిన ప్రాంతం అని చెప్పారు. ప్లానింగ్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియాలో కూడా హైద‌రాబాద్ మిన‌హా అన్ని జిల్లాల‌ను వెనుక‌బ‌డిన జిల్లాల్లో చేర్చారని అన్నారు. ఈ రోజు తెలంగాణ సాధించిన ప్రగ‌తిలో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉంది. అనేక విభాగాలు క‌లిసి ప‌ని చేయ‌డం వ‌ల్లే ప్రగ‌తి సాధ్యమైందని వెల్లడించారు. అద్భుత‌మైన రాష్ట్రాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. మంత్రుల నుంచి స‌ర్పంచ్ వ‌ర‌కు, సీఎస్ నుంచి గ్రూప్ -4 ఉద్యోగుల వ‌ర‌కు అంద‌రికీ న‌మ‌స్కరిస్తున్నానని చెప్పారు సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని వెల్లడించారు. సచివాలయ తరహాలోనే తెలంగాణ పల్లెలు కూడా వెలిగిపోతున్నాయని చెప్పారు.

అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తెలంగాణ రూపుదిద్దుకుంటుందున్నదని అన్నారు. . ‘తెలంగాణలో వెలుగు జిలుగులతో తెలంగాణ విరాజిల్లుతోంది. ఇది తెలంగాణ పునర్నిర్మాణం. కరెంట్ షాక్‌లతో రైతులు చనిపోయారు. కానీ, నేడు 24 గంటల కరెంట్‌తో రైతులు కంటి నిండా నిద్ర పోతున్నారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నాయి. ఆగమైపోయిన అడవులు పునర్నిర్మాణం చేసుకున్నాం. హరితశోభను వెదజల్లుతున్నాయి. వలసపోయిన పాలమూరు వాసులు తిరిగొచ్చి తమ పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. కూలీలు సరిపోక ఇతర రాష్ట్రాల కూలీలు పాలమూరుకు వస్తున్నారు. ఇది తెలంగాణ పునర్నిర్మాణం. మిషన్ భగీరథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రజలు తాగే నీటిని ఆదిలాబాద్‌లోని గోండు ప్రజలు సైతం తాగుతున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో మత కల్లోలాలు లేవు. గత డీజీపీలు అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి అద్భుతంగా పని చేశారు. ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తున్నాం. మహిళలకు భరోసానిస్తూ భరోసా కేంద్రాలు, షీ టీమ్స్ పని చేస్తున్నాయి. అరాచక ముఠాలను నివారిస్తున్నాం. సమ్మిళిత అభివృద్ధితో ముందుకు పోతున్నాం. పారిశ్రామిక రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఐటీ విధానంలో బెంగళూరును దాటి పోతున్నాం. మురికి కూపాలుగా ఉన్న పట్టణాలను అభివృద్ధి చేస్తున్నాం. పచ్చదనం, డంపుయార్డులతో, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లతో పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా రూపుదిద్దుకుంటుంది తెలంగాణ. అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లు, లింక్ రోడ్లతో హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తున్నాం..

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. ప్రపంచంలో అభివృద్ధిని, పునర్నిర్మాణాన్ని కొలమానంగా తీసుకునే సూచికలు రెండే రెండు ఉన్నవి. ఒకటి పర్ క్యాపిట ఇన్‌కం. రెండోది పర్ క్యాపిట పవర్ యుటిలైజేషన్. ఇవి నిజమైన అభివృద్ధి సంకేతాలు. నేషనల్, జాతీయ స్థాయిలో ముందున్నాం. తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, దేశంలోనే నంబర్ వన్ స్థాయికి పర్ క్యాపిటలో ముందున్నాం. పవర్ యుటిలైజేషన్‌లో 2,140 యూనిట్లతో దేశంలోనే అగ్రభాగాన ఉన్నాం. ఆసరా పెన్షన్లతో పేదల ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్నాం. సచివాలయం నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను’ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement