హైదరాబాద్ – సోమాజిగూడ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నేరుగా నందినగర్‌లోని తన సొంతింటికి వెళ్లారు. సొంతింటికి చేరుకున్న కేసీఆర్‌కు సాంప్రదాయ పద్ధతిలో దిష్టి తీసి, హారతితో ఇంట్లోకి స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ తన ఇంట్లోకి అడుగుపెట్టారు.
కేసీఆర్‌కు ఎడమకాలి తుంటి ఫ్రాక్చర్ కావడంతో యశోద ఆస్పత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు చికిత్స అనంతరం కోలుకున్న నేపథ్యంలో కేసీఆర్‌ను శుక్రవారం ఉదయం డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా తనకు చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు సహా యశోద సిబ్బందికి కేసీఆర్ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. కెసిఆర్ మరికొన్ని రోజులు నందినగర్ ఇంటిలోనే కుటుంబసభ్యులతో కలసి ఉండనున్నారు..
మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు
క్లిష్ట సమయంలో దేశ నలుమూలల నుంచి బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలు కనబర్చినందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కేసీఆర్ నంది నగర్ లోని తన నివాసానికి చేరుకున్న నేపథ్యంలో కవిత ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
తుంటి మార్పడి శస్త్రచికిత్స విజయవంతమై యశోద హాస్పిటల్ నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. కేసీఆర్‌కు చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులతో పాటు అన్ని విధాలా సహకరించిన దవాఖాన సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్లిష్టమైన సమయంలో దేశ నలుమూలల నుంచి లభించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞులమని పేర్కొన్నారు.