న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితి నెలకొందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన బండి సంజయ్ సహా బీజేపీ నేతల అరెస్టులు, నిర్బంధాలపై స్పందించారు. తెలంగాణలో ఈ నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నేతలను అరెస్టు చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు గురించి ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్‌దేశాయ్ చేసిన కామెంట్లను అరవింద్ గుర్తుచేశారు.
ప్రతిపక్షాల కూటమికి తనను చైర్మన్‌ను చేస్తే దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల ఎన్నికల ఖర్చంతా తానే భరిస్తానంటూ కేసీఆర్ రాయబారం సాగించినట్టు రాజ్‌దీప్ వెల్లడించారని తెలిపారు. గతంలో రాజ్‌దీప్ సర్దేశాయ్‌ను గొప్ప జర్నలిస్టుగా పొగిడిన విషయాన్ని కూడా అరవింద్ గుర్తుచేశారు. ఇంత డబ్బు కేసీఆర్ దగ్గర ఎలా ఉందంటూ దేశం మొత్తం నివ్వెరపోతోందని, ఆ విషయంపై నుంచి దృష్టి మళ్లించడం కోసం బీజేపీ నేతలను కేసీఆర్ అరెస్టులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పూర్తిగా పట్టు కోల్పోయారని, టీఎస్పీఎస్సీ లీకేజితో పాటు ఆయన కుమార్తె కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఉన్నారని, వీటన్నింటి కారణంగా తీవ్రమైన నైరాశ్యంలో కూరుకుపోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అరవింద్ మండిపడ్డారు.
హైదరాబాద్‌లో బండి సంజయ్ అరెస్ట్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ వంటి నేతల నిర్బంధంతో పాటు తన ఇంటికి కూడా పోలీసులు వెళ్లారని, కాకపోతే తాను ఢిల్లీలో ఉండడం వల్ల నిర్బంధించలేకపోయారని తెలిపారు. బీజేపీ నాయకులను దబాయించి ప్రభుత్వాన్ని నడుపుతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇలాంటి బెదిరింపులకు బీజేపీ నేతలు ఆగేది లేదు, వెనక్కి తగ్గేది లేదు అంటూ ఆయన ప్రకటించారు. నేతలందరినీ అరెస్టు చేసి ఎమర్జెన్సీ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.