హైదరాబాద్ – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఎవరూ ఆస్పత్రికి రావద్దని మాజీ మంత్రి హరీశ్‌రావు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ ఇవాళ సాయంత్రం తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోనున్నారని తెలిపారు. కేసీఆర్ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని హరీశ్ రావు అన్నారు. సర్జరీ సమయంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎవ్వరూ ఆస్పత్రికి రావద్దని కోరుతున్నానని తెలిపారు. కేసీఆర్ కు విశ్రాంతి అవసరమన్నారు. త్వరగా కోలుకుని మళ్లీ ప్రజలతో ఆయన మమేకమవుతారని వెల్లడించారు..
కాగా హాస్పటల్లో కెసిఆర్ సతీమణి శోభ, కుమారుడు కెటిఆర్, కుమార్తె కవితతో పాటు ఎంపి సంతోష్ కుమార్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.. అలాగే ప్రభుత్వం తరుపున ఆరోగ్య శాఖ కు చెందిన అధికారి కూడా అక్కడే ఉండి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సిఎం రేవంత్ రెడ్డికి తెలియజేస్తున్నారు..ఇక కేసీఆర్ ఆరోగ్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ గాయం గురించి విని చాలా బాధపడ్డానని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.