Tuesday, November 26, 2024

రోజూ స‌చివాల‌యానికి కెసిఆర్ – చ‌క చ‌కా క్లీయ‌రవుతున్న ఫైల్స్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొత్త పరిపాలనా సౌధంలో సరికొత్తగా పాలన కొత్త పుంతలు తొక్కుతోంది. నూతన సచివాలయంలో పాలనా వేగం పెరుగుతోంది. తాజాగా సీఎం కేసీఆర్‌ పాలనపై దృష్టి కేంద్రీకరించారు. పెండింగ్‌ దస్త్రాల క్లీయరెన్స్‌కు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఎన్నికల ఏడాదిలో అన్ని హామీల అమలులో భాగంగా పెండింగ్‌ ఫైల్స్‌ను దుమ్ముదులిపే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందులో భాగంగా కొత్త సచివాలయానికి ప్రతీరోజూ విచ్చేసి వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అన్ని ప్రభుత్వ శాఖలు పాలన అంతా నూతన సచివాలయంనుంచే సాగిస్తుండటంతోపాటు, సమీకృత సచివాయంలో ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటోంది. ఇదే సమయంలో పెండింగ్‌ ఫైళ్లపై సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడంతోపాటు స్వయంగా సీఎం కార్యా లయానికి చెందిన ముఖ్యమైన దస్త్రాలను ప్రగతి భవన్‌ టూ సచివా లయానికి చేర్చాలనే ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.

ఈ క్రమంలో వందలాది దస్త్రాల కట్టలు సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌లోని కార్లలోనే సీఎంఓకు తరలించారు. అయితే పాలన అంతా ఇకమీదట నూతన సచివాలయంనుంచే జరుగుతుందనే సంకేతాలతోపాటు, తనవద్దే కాదు, ఏ శాఖాధిపతి కూడా ఫైళ్లను పెండింగ్‌లో పెట్టకుండా పాలనా అంతా పారదర్శకంగా, వేగంగా జరగాలని సీఎం కేసీఆర్‌ హింట్‌ ఇచ్చారని అంటున్నారు. దీంతో నేరుగా సీఎంఓలో ఫైళ్ల క్లీయరెన్స్‌ జరిగితే అనివార్యంగా అన్ని శాఖల్లో పెండింగ్‌ ఫైల్స్‌ను తిరస్కరించడమో, క్లీయర్‌ చేయడమో లేదంటే తిప్పిపంపడమో జరగాల్సిందే.

ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ పలు అంశాల్లో దేశానికే రోల్‌ మోడల్‌గా నిల్చింది. అనేక రంగాల్లో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్నది. అయితే తొమ్మిదేళ్లుగా పాలనలో వేగంతో ఎటువంటి నిర్ణయాల అమలులోనూ జాప్యం చేయకుండా ముందుకుసాగింది. కానీ పాలన అంతా సీఎం అధికారిక నివాసంనుంచేనని, ఆయన కార్యాలయానికి రాకపోతే పాలన ఎలా సగుతుందని వివక్షాలు రాద్ధాంతం చేస్తూ వచ్చాయి. దీనికి విరుగుడుగా ఆయన నూతన సచివాలయాన్ని రికార్డు సమయంలో నిర్మించి, ప్రారంభించి ఆయన కార్యాలయంనుంచే రోజూ పాలన సాగిస్తున్నారు. తెలంగాణ స్థాయికి తగ్గట్లుగా సకల హంగులతో నిర్మితమైన భవనంనుంచి సాగుతున్న పాలన అంతా వేగవంతంగా ఉండాలనే కోణంలో ఆయన నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఈ దిశలో ఎటువంటి ఫైల్స్‌కు పెండింగ్‌ ముద్ర పడకుండా సత్వర నిర్ణయాలతో ప్రజలకు మేలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అన్ని శాఖల్లో ఇప్పటివరకు పేరుకుపోయిన ఫైల్స్‌ను తక్షణమే పరిశీలించాలని, పెండింగ్‌ ఇండెక్స్‌లను, సీరియల్‌ నెంబరల్‌ వారీగా, ప్రాధాన్యతల ఆధారంగా నోట్స్‌ రెడీ చేస్తున్నారని తెలిసింది.

శాఖల వారీగా పేరుకుపోయిన దస్త్రాలు, ఎంత కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి…? ఇంకా వీటిని రావాల్సిన అదనపు సమాచారం, వివరాలను కోరుతూ నివేదికలు రూపొందించనున్నారు. తద్వారా పాలనలో ఇప్పటివరకు స్థబ్ధుగా ఉండిపోయిన ఫైళ్ల క్లియరెన్స్‌, ఎవరూ పట్టించుకోని కారణంగా ఎక్కడికక్కడ నిల్చిపోయిన ఫైళ్లకు గ్రహణం వీడనుంది. ప్రజా సంక్షేమ, ప్రజోపయోగ కార్యక్రమాలకు చెందిన ఫైల్స్‌తోపాటు, ప్రభుత్వ విధానపరమైన పలు నిర్ణయాలు కూడా అమలుకు నోచనున్నాయి. గతంలో జిల్లాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించిన సందర్భాల్లో ఇచ్చిన హామీలు, ప్రజల విజ్ఞప్తుల వంటివి ఈ సందర్భంగా పరిశీలనకు రానున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ఏడాదిలో సీఎం కేసీఆర్‌ మరిన్ని వరాలు ప్రకటించి అమలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement