Friday, November 22, 2024

KCR: రంగంలోకి కేసీఆర్‌…తెలంగాణ భ‌వ‌న్‌లో కీల‌క భేటీ…

మాజీ సీఎం కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్‌గా మారారు. గ‌త కొద్ది రోజుల క్రితం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన కేసీఆర్ అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు. శస్త్రచికిత్స తర్వాత ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. దాదాపు రెండు నెలలుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల రాజకీయంగా క్రియాశీలకంగా మారారు.

అయితే ఎన్నిక‌ల అనంత‌రం మొద‌టిసారిగా ఇవాళ ఆయ‌న తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అప్పటి ప్రగతి భవన్ నుంచి ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి అసెంబ్లీకి చేరుకున్న ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట ప్రమాణం చేశారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు.

కృష్ణా నది నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించడంపై ఇటీవల వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో కృష్ణా పరివాహక ప్రాంతాల బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో కేసీఆర్‌ సమావేశమవుతున్నారు. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కేంద్రానికి అప్పగించడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ… కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు సిద్ధమైంది. కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ త్వరలో నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ భేటీ నిర్వహణపై కూడా కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కృష్ణా నది సమస్యను ఉపయోగించుకోవాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. కేసీఆర్ కూడా రాజకీయంగా యాక్టివ్‌గా మారడంతో ఇప్పుడు కాంగ్రెస్‌పై ఎదురుదాడికి బీఆర్‌ఎస్ సిద్ధమైంది. అందులో భాగంగానే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement