ఇల్లందు అక్టోబర్ 13(ప్రభ న్యూస్) కే సి ఆర్ నాయకత్వం లో తొమ్మిదిన్నర ఏళ్ల జనరంజక పాలన గురించి క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ,నాయకులు ప్రచారం చేయాలనీ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్,ఎం పి వద్ధిరాజు రవిచంద్ర కోరారు. శుక్రవారం అసమ్మతి నేతలతో కలిసి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం వారు పాల్గొని మాట్లాడుతూ నవంబర్ 1 ఇల్లందులో జరుగు బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని,ఈ బహిరంగ సభ ను జయప్రదం చేయాలని కోరారు.
నియోజకవర్గం నుండి 75 వేల మంది జన సమీకరణ చేసేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయడం జరిగిందన్నారు. ఇల్లందు పట్టణం,మండలం నుండి 30 వేల మంది,టేకులపల్లి నుండి15,వేల మంది,గార్ల,కామేపల్లి,బయ్యారం నుండి 10 వేలమందిని సమీకరించేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
ఇల్లందు నియోజకవర్గంలో 1,20,000 మంది ప్రభుత్వం నుండి లబ్ధి పొందారని, వారందరినీ నేరుగా కలిసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించే ఆవశ్యకతను వివరిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి కుటుంబం ప్రభుత్వం నుండి వచ్చే లబ్ధిని ఏదో ఒక పథకం ద్వారా పొందారని పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతుబంధు మైనార్టీ బందు బీసీ బందు, పోడు పట్టాలు, దళిత బంధు ఇలా ఎన్నో పథకాలు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చాయని అన్నారు. ముఖ్యంగా పోడు పట్టాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధికంగా అందజేశారని తెలిపారు. 4000 పెన్షన్ ఇస్తాను మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ప్రతిపక్ష పార్టీ అడగడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 14 సార్లు అవకాశం ఇచ్చారని 200 రూపాయలు పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారని అప్పుడు ఇవ్వలేని పెన్షన్ ఇప్పుడు ఎలా ఇస్తారని ప్రజలు ఆలోచించాలని కోరారు. పక్క రాష్ట్ర చతిస్ ఘడ్ లో 700 పెన్షన్ అందజేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మాత్రం 4000 ఇస్తామంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇస్తున్నారా అని ప్రశ్నించారు. గోదావరి జలాలు, 24 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని, ఎన్నికల సమయంలో వచ్చే టూరిస్టులను నమ్మి మోసపోవద్దు అని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అయిన సీతారామ ప్రాజెక్టు కు 3200 కోట్లు కేటాయింపు జరిగిందని ఇది కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణనకు సాధ్యం కానీ హామీలతో ప్రజల ముందుకు వచ్చి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని వారి మాయమాటలకు మోసపోవద్దని అన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మహబూబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ బిందు, గ్రంధాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మూల మధుకర్ రెడ్డి జనగం కోటేశ్వరరావు, మెట్ల కృష్ణ వార్డు కౌన్సిలర్లు, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.