ఖమ్మం బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాలేరు ప్రజల ఆశీర్వాదం పొందేందుకు, హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని జీళ్ళ చెరువు గ్రామంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం సభ ఏర్పాట్లలో భాగంగా పాలేరు నియోజకవర్గం లోని కూసుమంచి మండలం జీల్ల చెరువు గ్రామంలో బహిరంగ సభ ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈనెల 27న మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల శంఖారావం పూరించనున్నారని తెలిపారు. పాలేరు నియోజకవర్గ ప్రజలతోపాటు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పై సీఎం కేసీఆర్ కు ఎంతో అభిమానం ఉంటుందని, వేల కోట్లతో జరిగిన అభివృద్ధి అందుకు నిదర్శనం అన్నారు. కరోనా కష్టాల్లో ప్రజలకు ఏ రూపంలో సహాయం చేయలేని నాయకులు కొందరు ఎన్నికల సందర్భంలో గొప్ప గొప్ప మాటలు చెబుతున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రిగా సుదీర్ఘ అనుభవం కలిగిన తుమ్మల నాగేశ్వరరావు గత ప్రభుత్వాల కాలంలో భక్త రామదాసు ప్రాజెక్టును ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే సీఎం కేసీఆర్ సారధ్యంలో వేలకోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసా గాయని ప్రస్తావించారు. లక్ష మందితో సీఎం కేసీఆర్ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 75 నుండి 80 సీట్లతో బీ ఆర్ ఎస్ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తాతా మధు సూదన్ మాట్లాడుతూ పాలేరులో జరిగే సీఎం సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే రాష్ట్రంలోనే మొదటి ఇరిగేషన్ ప్రాజెక్టుగా భక్త రామదాసు ప్రాజెక్టును చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు.రూ. 78 కోట్లతో పాలేరు పాత కాలువను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రూ.300 కోట్లతో గ్రామాల్లో సిసి రోడ్లు వేయించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది, ఎమ్మెల్యే కందాలదేనని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి సభ గేట్ వే ఆఫ్ పాలేరు గా ఉన్న పాలేరు నియోజకవర్గం లో జరుగుతుందని, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంట డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, పలువురు నాయకులు పాల్గొన్నారు.