Friday, November 22, 2024

KCR Campaign – డిపెండెంట్ ఉద్యోగాలను పోగొట్టిందే కాంగ్రెస్ …భారాస చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు భద్రం… కెసిఆర్

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, నవంబర్ 24 (ప్రభన్యూస్) : భారత రాష్ట్ర సమితి చేతుల్లోనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు భద్రంగా ఉంటుందని, ప్రజలు ఎన్నికలంటే ఆగమాగం కాకుండా ఆలోచించి మీ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోవాలని, మంచి, చెడులను బేరీజు వేసుకోవాలని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరై ప్రసంగించారు. సింగరేణి సంస్థలో కార్మికులకు ఉన్న వారసత్వ ఉద్యోగాల హక్కులను కాంగ్రెస్, కమ్యూనిస్టు అనుబంధ సంస్థలైన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీల హయాంలోనే తొలగించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం భారాస ప్రభుత్వ హయాంలో మళ్లీ కారుణ్య నియామకాలను చేపట్టి సుమారు 15వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగిందని అన్నారు.

చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం సంస్థను నడపలేక కేంద్రం నుంచి అప్పులు తెచ్చి ఆ అప్పులు తీర్చలేక 49 శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టిందని ఆరోపించారు. సింగరేణి ఉద్యోగులకు గృహ నిర్మాణం కోసం రూ.10లక్షల వడ్డీ లేని రుణంతో పాటు లాభాల్లో 32 శాతం వాటాను ఇచ్చి సుమారు రూ.1000 కోట్లను కార్మికులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. సింగరేణి కార్మికుల జీతాలపై ఉన్న ఆధాయపు పన్నును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపించినప్పటికీ కేంద్రం మోకాలొడ్డిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకువచ్చామని, గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించామని, రైతుబంధు, రైతుబీమాతో పాటు వరిపంట కొనుగోళ్లు ప్రక్రియను కొనసాగిస్తున్నామని, వచ్చే ప్రభుత్వ హయాంలో రైతుబంధును ఎకరాకు రూ.10వేల నుంచి రూ. 16వేలకు పెంచనున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుబంధు దుబారా అని, 24 గంటలు కరెంట్ అవసరం లేదని, 3 గంటలు సరిపోతుందని, ధరణిని తొలగిస్తామని అంటున్నారా అని, వాటిని తీసేద్దామా అని సభికులను ప్రశ్నించి సమాధానం రాబట్టారు. ధరణి ఉండాలని, ధరణి ద్వారానే రైతులకు ఉన్న కష్టాలు తీరిపోయాయని, ధరణిని తీసివేస్తే లంచం లేనిదే పని కాని పరిస్థితి నెలకొంటుందని, వైకుంఠపాళి ఆటలో పెద్ద పాము మింగినట్లు అవుతుందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లనే 58 యేండ్ల పాటు కష్టపడ్డారని, కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని చావు నోట్లో తలపెడితే, 33 పార్టీలు మద్దతు తెలిపితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, ఇచ్చిన రాష్ట్రాన్ని మంది మాటలు విని మార్వానం పోతే… మళ్లీ ఇంటికి వచ్చే సరికి ఇల్లు కాలిపోయిన… చందంగా రాష్ట్రం తయారవుతుందని అన్నారు. ఎవరు ఊహించని కంటి వెలుగు పథకం, పల్లె దావఖానా, బస్తీ దావఖానా, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలను ప్రవేశ పెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న వ్యక్తి పేకాట క్లబ్ నిర్వావాణలో ఘనుడని, అతనికి అధికారం ఇస్తే వాడవాడలా పేకాట క్లబ్ లు వెలుస్తాయని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు సౌమ్యుడని, నిజాయితీపరుడని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటాడని, మరోమారు ఆయనను గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటునందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగానికంటే ముందు బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల ప్రత్యేక జిల్లా ఏర్పాటు, మెడికల్ కళాశాల ఏర్పాటు, గూడెం లిఫ్ట్ ఇరిగేషన్, సింగరేణి స్థలాల్లో ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని, వర్షాకాలం సమయంలో గోదావరి వరదతో మంచిర్యాల, నస్పూర్ పట్టణాలు నీట మునుగుతున్నాయని, కరకట్టల నిర్మాణం చేపట్టాలని, రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఐటీ హబ్ లాంటివి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో దివాకర్ రావును గెలిపిస్తే ఇవన్నీ సాధించుకోవచ్చునని ప్రజలను కోరారు.
ఈ సభలో ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్సీలు మధుసుదనాచారి, భానుప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement